పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుబ — (పకపకనవ్వుచు దానిని లేవఁదీసి) హాహాహా! నీకిప్పు డేమీ ప్రాణభయం లేదు. లే. (పయివంక చూచి) ఆవచ్చిన వారెవరు!

రాము - బాబూ! నన్ను కొట్టకండి. నేను వెళ్ళిపోతాను. (అని గంతులు వేయుచున్నాఁడు)

సుబ — అమ్మీ! నీవు వెళ్ళిపో.

గౌరి - దేవుడా! ఇవేళకు బ్రతికి పోయినాను. (అని లోపలికి పరుగెత్తుచున్నది.)

సుబ — పాపం యిది పడుచుతనంలో బాగానే వున్నదికాని దీనికి కొంచెం వెర్రి అనుకుంటాను. వెర్రికాకపోతే యేమీకారణంలేనిదే నన్ను చూచి భయపడి యిలాగు వెర్రి కేకలు వెయ్యదు. వీడుకూడా లోప లీ లికి పరుగెత్తబోతూవున్నాడు. (అని పై బట్టపట్టుకొని) ఓరీ పిచ్చవాడా! యెక్కడికి పరుగెత్తిపోతావు?

రాము — బాబూ బాబూ! నాబట్ట చింపివెయ్యకండి. నెల్లాళ్ళ యినా కాలేదుకొత్తబట్ట కొనుక్కున్నాను.

సుబ -- (బట్టవిడిచి) ఓరి మూఢుడా! నేను నీబట్ట చింపుతానను కున్నావుట్రా?

రాము – అయ్యా! మీకుదణ్నంపెడుతాను. దూరంగావుం డండి. నాజోలికిరాకండి. మీపిచ్చిచేష్టలు నామీద చూపకండి.

సుబ — దున్నపోతా! నావిపిచ్చిచేష్టలు అంటావురా? (అని రాముని జుట్టుపట్టుకొని వంగతీయుచున్నాఁడు.)

రాము – బాబూ! చస్తిని చస్తిని. (అని కేకలు వేయు చున్నాఁడు.)