పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతి - (తలుపుచాటునుండి చూచుచు) అమ్మాయీ! సుమతీ! మీబావస్థితి చూచినావా? గౌరీ! మమ్మలిని తోసుకునిరాకు. నీవు తరువాత చూస్తువుకానిలే.

సుబ — మానాన్నగారు నన్ను యిక్కడకు అధాత్తుగా పం పించివేసినారు. మా మామగారు వట్టిచేదస్తుడు. ఇప్పుడు యోగపు పిచ్చలోపడి నిద్రాహారాలు లేకుండా రాత్రీపగలూ దానిలో మునిగి తేలుతూ వున్నాడట. అయినాకానీ యిక్కడ నాకు మనసుకలిసిన సుమతి యింట్లోవున్నదిగనుక వేడుకగా ప్రొద్దుగడపవచ్చును. యీ తాటాకు పుస్తకాలన్నీ మామగారి పాతపురాణాలు కాబోలును.

మతి - (చెవిలో గుసగుసలాడుచు) అమ్మాయీ! అవిపాత పురాణాలట. తానుకాదు. నేనేపిచ్చలోపడి వున్నానట. ఆమాటలు విన్నావా? ఈగౌరివూరికే తొందరపడుతూవున్నది. దాన్ని చూడ నియ్యి. మనం వెళుదాము. (అని వెళ్ళుచున్నారు.)

సుబ — (తలయెత్తిచూచి) యెవరో గుసగుసలాడుతూ వున్న ట్టున్నారు. అదుగో ఆతలుపుదగ్గిర యెవరో చీరెకట్టుకుని నిలుచు న్నారు. (అని తలుపువద్ధికి వెళ్ళి తలుపు తీసి గౌరిని ఈవలికి లాగు చున్నాఁడు.)

గౌరి - (కాళ్ళమీదపడి) మహాప్రభో! నన్ను రక్షించండి. చంప కండి. నాతల్లి ముసలిది. దానికి నేనుతప్ప మరియెవరూ దిక్కు లేరు. నేనూ పదిహేడేళ్ళదాన్ని . కొంచెం కాలంలోనే పెళ్ళిచేసుకుని సుఖ పడవలె ననుకుంటూవున్నాను. నా ప్రాణాలు కాపాడండి.

(అంతట రాముఁడు ప్రవేశించుచున్నాఁడు)

రాము - (తనలో) ఈపిచ్చివాడు దీన్ని కౌగలించుకోవడానికి ప్రయత్నం చేస్తూవున్నట్టున్నాడు. ఇదివకవేళ అయితే మదపిచ్చ అయివుంటుంది.