పుట:ముత్యాల సరాలు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేల నెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ.

మతములన్నియు మాసి పోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును;
అంత స్వర్గ సుఖంబులన్నవి
యవని విలసిల్లున్.

మొన్న పట్టణమందు ప్రాజ్ఞులు
మొట్టమొదటిది మెట్టు యిదియని,
పెట్టినా రొక విందు, జాతుల
జేర్చి;వినవైతో?"

అంటి నే నిట్లంత ప్రియసఖి
యేమి పలకక యుండి యొక తరి,
పిదప కన్నుల నీరు కారుచు
పలికె నీరీతిన్.

"వింటి మీ పోకిళ్ళు వింటిని,
కంట నిద్దుర కానకుంటిని
యీ చిన్న మనసును చిన్న బుచ్చుట
యెన్నికని యోచించిరో?

తోటి కోడలు దెప్పె; పోనీ;
సాటివా రోదార్చె; పోనీ;
మాటలాడక చూచి నవ్వెడి
మగువకే మందున్.