పుట:మార్కండేయపురాణము (మారన).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలస తనపుత్త్రులకు తత్త్వోపదేశము చేయుట

సీ.

నీవు నిర్మలుఁడవు నీ కెక్కడిది పేరు భావింపు మది కల్పనావికార
మొడలు నీయదియు నీవొడలివాఁడవు గామి యెఱుఁగు మేడ్వకుము నీయేడ్పు టెలుఁగు
భూమ్యాదినివహంబుఁ బొంది విశ్వజ మైన శబ్దంబు గాని నీస్వనము గాదు
హానివృద్ధులఁ బొరయవు నీవు భోజ్యాన్నపానభోక్తవు గావు గానఁ గుఱ్ఱ


తే.

యితఁడు తండ్రి తల్లి యిది యేను దనయుండ, వీరు హితులు నాకు వీ రహితులు
నీధనంబు నాది యే నియ్య ననుపల్కు, లుడుగు మయ్య! భేద ముడిగి యుండు.

103


ఆ.

పుణ్యపాపకర్మపుంజనిబద్ధ మై, తొడిగినకుబుసంబువడువు దాల్చ
జీర్ణ మగుచునుండు చెనఁటి దేహంబున, యందు నీవు మమతఁ బొంద వలదు.

104


వ.

అని మఱియు మదాలస బహుప్రకారంబుల దేహజీవాత్మతత్త్వరూపంబు లాలాప
పథంబున నుపదేశింప ననుదినప్రవర్ధమానుం డగునబ్బాలుండు బలంబును బుద్ధియు
నానాఁటికిం బ్రవృద్ధిం బొందినట్లు తల్లి వచనంబులంజేసి విమలజ్ఞానం బంత కంతకు
నతిశయిల్లుచుండం బెరిఁగి పరమయోగియై గృహస్థత్వంబు విడిచి చనియెం దద
నంతరంబ యిరువురుకొడుకు లుదయించిన వారికిం గ్రమంబున నన్నరేంద్రుండు
సుబాహుండు శత్రుమర్దనుండు నని నామంబు లొనరించిన నగుచు నమ్మగువ
యయ్యిద్దఱునందనుల నెప్పటియట్ల యోగవిద్యావిదగ్ధులుగాఁ బ్రబోధించె నంత
నయ్యింతికి నాలవపుత్రుండు పుట్టుటయును.

105


క.

బాలునికిఁ బే రిడఁగ భూ, పాలుఁడు వచ్చిన నిజాస్యపద్మము వికచ
శ్రీలసితముగ మదాలస, యాలాపము నేయఁ జూచి యతఁ డిట్లనియెన్.

106


మ.

రమణీ పుత్తుల కర్థి నే నిడినవిక్రాంతాదినామంబు లె
ల్ల మది న్మెచ్చవు నీవు రాజతనయాలంకారము ల్గావొకో
విమతక్ష్మావరకోటిచిత్తముల కుద్వేగంబు గల్పింపవో
యమితైశ్వర్యము సేయవో నగఁ గతం బం దెద్ది యూహింపఁగన్.

107


ఉ.

నేరనివార మేము రమణీ! యిటు వెట్టితి మర్థిఁ బేళ్లు నీ
నేరిమి చూడ నీసుతుని నిర్మలినాహ్వయుఁ జేయుమా ప్రియం
బారఁగ నన్న నింతి! భవదాజ్ఞ నొనర్చెద నేను వీనికిం
బే రిల వీఁ డలర్కుఁ డనఁ బెంపు వహించు నరేంద్ర! నావుడున్.

108


క.

అద్ధరణీశుఁడు నవ్వుచు, బుద్ధివివేకములఁ గరము ప్రోడ విటు లసం
బద్ధ మలర్కుండనుపే, రిద్దచరిత! యెట్లు పెట్టి! తిది సార్థకమే?

109


తే.

అనిన నయ్యోగిమాత యిట్లనియె నధిపః, యవధరింపు మసద్వ్యవహారమునకు
నై యొనర్తురు గాక యాహ్వయము సార్థ, ముగ నొనర్పఁగ వచ్చునె పురుషునకును.

110


క.

నీపెట్టినపేళ్లును విను, నాపెట్టినపేరు వోలె నరవర! సర్వ
వ్యాపి యగుపురుషునికి న, ర్థోపేతత్త్వంబుఁ బొంద వూహింపంగన్.

111