పుట:మార్కండేయపురాణము (మారన).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అది యెట్లనిన.

112


సీ.

ఒకచోటినుండి వేఱొకచోటి కరుగుట క్రాంతి నాఁజను నిట్టిక్రాంతి లేక
సర్వగతుండును సర్వాత్ముఁడును సర్వభూతేశుఁడును నగుపురుషునకును
విక్రాంతుఁ డనుపేరు విపులార్థవంతమో వ్యర్థమో యిది నీవ యవధరింపు
నిరవయవుం డైన నిత్యునకు సుబాహు నామం బొనర్చిన నగవు గాదె


తే.

యెల్లజీవంబులందును నేకభావ, మై వెలుఁగునాత్మునకు నెవ్వఁ డహితుఁడు హితుఁ
డనఁగ నెవఁ? డెట్టు శత్రుమర్దనసమాఖ్య, కర్థగతి యించుఁ జెప్పుమా పార్థివేంద్ర!

113


క.

తనయోద్దేశంబున నీ, వొనరించినపేళు లర్థయుక్తములే ని
త్యనిరాలంబజ్యోతికి, సనాతనుం డైనయట్టిసర్వాత్మునకున్.

114


వ.

కావున.

115


క.

వ్యవహారార్థపునామము, లవనీశ! నిరర్థకంబు లవుటకు నొడఁబా
టవు నేని యలర్కాఖ్యయు, నవుఁ గైకొను మపురుషార్థ మనకుము దానిన్.

116


వ.

అని పరమార్థవాదిని యగుజీవితేశ్వరి చెప్పిన విని మహామతి యైనఋతధ్వజుండు
దానికి నొడంబడియె నంత నక్కాంతాతిలకంబు పూర్వనందనుల బోధించినట్టులఁ
బరమబ్రహ్మబోధకంబు లగువాక్యంబుల నయ్యలర్కు బోధింపం దొడంగినం గువల
యాశ్వుం డద్దేవి నాలోకించి.

117


ఉ.

ఎక్కడి బ్రహ్మబోధ? మిది యేటికి వీనికి? నెంత వెఱ్ఱివే
యక్కట! పుత్రరత్నముల నాఱడి బోద్ధలఁ జేసి పుచ్చి వే
చిక్కునఁ బెట్టి తింక నటు చేయకు మీసుతుబుద్ధి శ్రద్ధతో
నెక్కొనఁ ధర్మమార్గమున నిల్పుము దెల్పుము రాజధర్మముల్.

118


వ.

అని మఱియును.

119

మదాలస యలర్కు డనుపుత్త్రునకుఁ గర్మమార్గ ముపదేశించుట

క.

విను పుణ్యాపుణ్యంబుల, ననిమిషతిర్యక్త్వయుక్తు లగుపితరులకు
న్మనుజుఁడు దృషయును క్షుధయును, దనుకఁగ నీఁ డుదకపిండదానక్రియలన్.

120


ఆ.

అతిథిబంధుదేవపితృపిశాచప్రేత, యక్షమనుజభూతపక్షికీట
కముల కెల్ల విహితకర్మరతుం డైన,యతఁడు సూవె యాశ్రయంబు దరుణి!

121


క.

కావున మత్సుతుఁ దన్వీ!, కావింపుము రాజధర్మకర్మావితుఁగా
నావుడుఁ బతిబంపున న, ద్దేవి యలర్కునకుఁ గర్మదీక్ష యొనర్పన్.

122


వ.

తలచి యనుదినంబును నబ్బాలుని ముద్దాడుచు.

123


ఉ.

ధన్యుఁడ వైతి పుత్త్ర! వసుధాతల మెల్ల నకంటకంబుగా
నన్యనరేంద్రభీకరకరాసిసమంచితదోర్బలక్రియా
మాన్యత యొప్ప నేలి యసమానయశోవిభవంబు నొంది ప
ర్జన్యపురోపభోగబహుసౌఖ్యము లందఁగ నీవు గాంచుటన్.

124