పుట:మార్కండేయపురాణము (మారన).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మెఱయు క్రొమ్మెఱుఁగులమించును మెలఁతగా మీనకేతనుఁడు నిర్మించినట్లు
చారుశృంగారరసముతేట నింతిగా నించువిల్తుండు చిత్రించినట్లు
నవకల్పలతికలనవకంబు నాతిగా శ్రీనందనుఁడు సంతరించినట్లు
నిండారుచందురునినుపారునునుఁగాంతిఁ జెలువగా మరుఁడు సృజించినట్లు


తే.

విస్మయం బైనలావణ్యవిలసనమునఁ, బొలుచు నమ్మదాలసఁ జూచి భూపసుతుఁడు
విగతలజ్జుఁ డై ననుఁ బాసి వెలఁది యెందుఁ, బోయి తనుచు నాదటఁ జేరఁబోవుటయును.

93


వ.

ఫణీశ్వరుఁ డతని వారింపుచు.

94


క.

మాయారూపము ముట్టిన, మాయం బగుఁ గాన నృపకుమారక! నీ వీ
మాయారూపము ముట్టకు, మీ యనవుడు మోహవశత నిల నతఁ డొఱగెన్.

95


క.

ధరణిజలానలమరుదం, బరచేష్టం దోఁచునీప్రపంచం బెల్ల
న్బరికింప మాయ యగుట, న్దరుణియు మాయ యని యశ్వతరుఁ డిటు సూపెన్.

96


వ.

అంత నతని మూర్ఛఁ దేర్చి యూఱడించి యురగేశ్వరుండు గంధర్వరాజనందనం
బడసినతెఱం గెల్ల నెఱింగించినం గువలయాశ్వుండు విస్మయహర్షమగ్నుం డగుచు
నభివందనం బాచరించి సముచితంబుగా వీడ్కొని తలంచినయంతన యరుగుదెంచిన
కువలయాశ్వంబు నక్కువలయగంధియుం దాను నెక్కి నిజపురంబున కరిగి తండ్రి
చరణంబులకుం బ్రణమిల్లి మదాలసాపునరుద్భవప్రకారం బేర్పడం జెప్పి జననీ
ప్రభృతిబంధుజనంబులకుం బరమానందం బొనరించె నాసుందరియును శ్వశురాది
గురుజనంబులకు మ్రొక్కి సంభాషణసంభావనాశ్లేషంబుల సుహృజ్జనులం బ్రమోద
భరితులం గావించి యెప్పటియట్ల వర్తించుచు.

97


క.

ప్రియము చెలంగ మదాలస, ప్రియకరణిన్ హర్మ్యవనగిరిస్థలములఁ ద
ద్దయుఁ గామభోగపుణ్య, క్షయ మెదఁ గోరుచు రమించె సద్భావమునన్.

98


వ.

అంత.

99


శా.

శత్రుక్షత్రలతాలవిత్రపటుదోశ్శౌర్యాధ్యుఁడై శత్రుజి
ద్ధాత్రీనాథుఁడు పెద్దకాల మిటు లీఛాత్రితలం బిద్ధచా
రిత్రం బొప్పఁగ నేలి నిర్జరపరశ్రీలోలతం జన్నఁ ద
త్పుత్త్రుం డుత్తముఁ డాఋతధ్వజుఁడు దాఁ బూనె న్ధరాభారమున్.

100

మదాలస పుత్రులఁ గనుట

క.

అంత మదాలస గాంచె ని, తాంతోజ్జ్వలతేజుఁ డైనతనయు నతనికి
న్సంతసమున జనకుఁడు వి, క్రాంతుం డనుపేరు పెట్టె గారవ మెసఁగన్.

101


వ.

దానికి భృత్యామాత్యజనంబులు సంతసిల్లిరి మదాలస నవ్వుచుం గనకపర్యంకతలం
బున నుత్తానశాయి యై యవిస్వరంబుగ నేడ్చుకొడుకును ముద్దాడునదియుఁ
బోలె ని ట్లనియె.

102