పుట:మార్కండేయపురాణము (మారన).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్యలు గానిపింప దివ్యమాల్యాంబరాభరణశోభితుండును వజ్రవైడూర్యఖచిత
కాంచనాసనాసీనుండును భుజంగమాంగనాకరకలితచారుచామీకరచామరవ్యజ
నవీజ్యమానుండును నై వెలుంగుచున్న పన్నగేశ్వరుం గని తచ్చరణంబులకుం
బ్రణామంబు నేసిన నతండు కువలయాశ్వుం గౌఁగిలించుకొని మూర్ధఘ్రాణంబు
చేసి దీవించి యుచితాసనంబున నునిచి యి ట్లనియె.

70

నాగేంద్రుఁడు కువలయాశ్వుని గౌరవించుట

తే.

నిరుపమానతేజుఁడ వైననీగుణముల, కెలమి నొందుచు నుండుదు నెపుడు నేను
సద్గుణునిజీవితము జనశ్లాఘనీయ, మనఘ! గుణవిహీనుండు సప్రాణశవము.

71


క.

తనయుండు తల్లిదండ్రుల, కనుపమసద్గుణసమృద్ధి నానందకరం
డును రిపులకు హృదయజ్వర, మును నై మను టొప్పు జన్మమునకు ఫలముగాన్.

72


క.

పరదూషణములు సేయక, దరిద్రు లగువారియందు దయ గలిగి విప
త్పరిపీడితులకు దిక్కై, పరగెడుపురుషుండు సుగుణబంధుగుఁ డెందున్.

73


చ.

అని ప్రియమారఁగాఁ బలికి యానృపసూతియుఁ దాను నాత్మనం
దనులును గూడి యొక్కట ముదంబున మజ్జనభోజనాదిని
త్యనియతకృత్యము ల్సలిపి యంత నభీష్టకథాప్రసంగతిన్
మన మలరంగఁ జేయుచుఁ గుమారునకు న్భుజగేంద్రుఁ డి ట్లనున్.

74

అశ్వతరకువలయాశ్వులసల్లాపము

తే.

భద్రమూర్తి మాయింటి కభ్యాగతుఁడవు, గానఁ బూజింపవలయు ని న్గారవమునఁ
గొడుకు తండ్రి నశంకత నడుగునట్టు, లడుగు నన్ను నీ కభిమత మైనధనము.

75


వ.

అనినం గువలయాశ్వుండు దేవా! మదీయసదనంబున సువర్ణాదిసమస్తవస్తువులు
సంపన్నంబులు సకలభూవల్లభుం డగుమాతండ్రి గలపదివేలేండ్లకు నా కేమిటం
గొఱంత లేదు పాతాళాధిపతి వైననీకారుణ్యంబునకు భాజనంబ నైతి నట్టినే
నింక నేమి యడుగువాఁడ నని వెండియు.

76


చ.

జనకభుజావనీజములచల్లనినీడ వసించి యుండునం
దనులు జగంబున న్సుఖులు తండ్రి మృతుం డయి చన్నఁ బిన్ననాఁ
డ నిజకుటుంబభారము గడంగి వహించుచుఁ తీవ్రదుఃఖవే
దనఁ బడువా రపుణ్యులు విధాతృనిచేఁత భుజంగమేశ్వరా!

77


వ.

కావున.

78


తే.

తండ్రికృపఁ దృణప్రాయము ల్ధనము లకట, గొఱఁత లే దర్థులకుఁ బెట్టఁ గుడువఁ గట్టఁ
బొలుచు యౌవనారోగ్యము ల్గలవు మున్న, యిట్టినాకు వేఁడంగ నిం కేమి వలయు.

79


క.

అనిన భుజంగమవిభుఁ డి, ట్లను మణికనకాదు లొల్ల వై తేని మనం
బున కొండెద్ది ప్రియము దా, నిన యడుగుము ప్రీతి నిత్తు నీకుఁ గుమారా.

80