పుట:మార్కండేయపురాణము (మారన).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బహువిధపదార్దంబులు నీవలన నుద్భవిల్లు నీస్వరవ్యంజనంబులం జేసి సమస్తంబు
సంవ్యాప్తం బై యుండు నీమహామహిమ యవాఙ్మౌనసగోచరం బని యనేకప్రకా
రంబులం ప్రస్తుతించిన బ్రసన్నసరస్వతి యశ్వతరునిం గనుంగొని పరలోక
ప్రాప్తుండైన నీయనుజుండు కంబళుండు చనుదెంచి తొల్లిటియట్ల నీకు సహాయుండు
గా వరం బిచ్చితినింక నీకభిమతం బెయ్యది? యడుగు మనిన నతండు దేవీ!
కంబళునకు నాకు సప్తస్వరమహితమధురగీతవిద్యావిశారదత్వంబు ప్రసాదింప
వలయు ననిన వాగ్దేవి యవ్వరం బొసంగి మత్ప్రసాదంబున మీరు స్వర్గమర్త్య
పాతాళంబులయం దెవ్వరికంటె నధికులయిన గాయకుల రగుఁ డని యంతర్ధానంబు
చేసినం బదతాళస్వరాదిలక్ష్యలక్షణంబంతయు నప్పుడ తమ కవగతం బగుటయు
నయ్యన్నయుం దమ్ముండును బరమానురాగంబునం దేలుచుఁ గైలాసంబున కరిగి.

కైలాసమున శివుఁ డశ్వతరునిపాటకు మెచ్చి వరమొసంగుట

స్రగ్ధర.

శ్రుతిశాంతావక్త్రపద్మస్ఫురితబహువిధస్తోత్రనవ్యార్థజాతో
ద్గతవైచిత్రీనిమగ్నాత్మకు సురమునిగంధర్వవిద్యాధరేంద్రా
ర్చితపాదాంభోజుఁ గాంతీశితృదశశతదృక్ఛ్రీపతి బ్రహ్మసేవా
సతతప్రేమాత్మచేతోజనితఘనదయాశాలిఁ జంద్రార్ధమౌళిన్.

53


మ.

కని భక్తిం బ్రణమిల్లి పన్నగపతు ల్గౌతూహలం బెంతయు
న్దనరంగా నధికప్రయత్నమున నిత్యంబు న్గడు న్జేరి రే
పును మధ్యాహ్నమునప్డు సంజలను మాపుం గొల్చి యప్పార్వతీ
శునిఁ గీర్తించుచు నింపుఁ బెంపు నెదలో సొంపారఁగాఁ బాడుచున్.

54


క.

అహిపతు లారాధన మిటు, బహుకాలము సేయ వారిపాటకుఁ గడుమె
చ్చి హరుం డడుగుఁడు వరముల, నహీనముగ నిత్తు ననిన ననురాగముతోన్.

55


తే.

అశ్వతరుఁడు తమ్ముండును నధికభక్తి, నమ్మహాదేవునకు మ్రొక్కి యమరవంద్య
దేవదేవ త్రిలోచన త్రిపురమథన, యిందుశేఖర దయ వర మిచ్చె దేని.

56


వ.

అవధరింపుము మరణప్రాప్త యైనకువలయాశ్వకుమారుని కులప్రమద మదాలస
తనపూర్వవయోరూపకాంతివిలసనములతో నా కిప్పుడు పుత్రి యై పుట్టి జాతిస్మ
రయుఁ బరమయోగినియును యోగిమాతయును గావలయు ననిన భవుండును
మత్ప్రసాదంబున నట్ల యయ్యెడు నీవు నిజపురంబునకుఁ జని నియతుండ వై
పితృప్రియంబుగా శ్రాద్ధం బొనరించి మధ్యమపిండం బుపయోగించి మదాలసాజనన
కామధ్యానపరుండ వగుచుండ నీమధ్యమఫణంబున నాసుమధ్య యుద్భవించు నని
వరం బిచ్చిన హర్షించి భుజగేశ్వరుండు భుజగకుండలునకు నమస్కరించి రసాత
లంబున కరిగి తత్ప్రకారంబున నాగంధర్వరాజనందనం బడసి యెవ్వరు నెఱుంగ
కుండ నంతర్గృహంబున నంగనాజనరక్షితం గావించి యొక్కనాఁడు కొడుకుల
కి ట్లనియె.

57