పుట:మార్కండేయపురాణము (మారన).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్సేయఁగ నవ్విభూషణము చేరి మదాలస ప్రాణవాయువు
ల్వోయి ప్రచండవాతహతపుష్పలతాకృతిఁ గూలె మేదినిన్.

19


క.

అంతటఁ బురజనసదనా, భ్యంతరముల నెల్ల నేడ్పు లడరెను ధరణీ
కాంతునిగృహమున నెట్లు దు, రంతాక్రందనము లడరె నట్టుల పెల్లై.

20


క.

పతిమరణశోకతాపా, హతి విగతప్రాణ యై మదాలస వజ్రా
హతిఁ బడినమణిశలాకా, కృతి నేలంబడినఁ జూచి క్షితిపతి మదిలోన్.

21

శత్రుజిత్తుఁడు దత్పత్నియు వైరాగ్యము నొందుట

వ.

ధైర్యం బవలంబించి పరిజనుల నవలోకించి యిట్లనియె.

22


తే.

అధ్రువంపుసంసారంబునందుఁ గల్గు, నఖిలసంబంధముల యనిత్యత దలంప
మనకు నాఱడి యిట్లు రోదనముచేత, తగవు గాదని చూచెదఁ దత్త్వయుక్తి.

23


క.

మతి నొక్కించుకయును నే, సుతునకుఁ గోడలికి నేని శోకించెదనే
కృతకృత్యత్వంబున వి, శ్రుతులగునయ్యిరువురును నశోచ్యులు మనకున్.

24


వ.

అది యె ట్లనిన.

25


ఉ.

నావచనంబున న్మునిజనస్థిరరక్షణనిత్యతత్పరుం
డై వెస నేఁగి యామునులకై సమరావని వీరకేళిమై
నేవపుదేహము న్విడిచి యెంతయు ధాత్రిఁ గృతార్థుఁ డైనపు
ణ్యావహమూర్తి యాకువలయాశ్వుఁ డశోచ్యుఁడు గాక శోచ్యుఁడే.

26


క.

జననిసతీత్త్వము వంశం, బున విమలత్వమును దనదుభుజవీర్యము నా
తనయుం డిటు వెలయించునె, యని విప్రార్థంబు కాఁగఁ బ్రాణచ్యుతుఁడై.

27


చ.

పతిమృతి విన్నమాత్ర నిజభావము దద్గత మైనఁ దాన సు
వ్రత యిటు ప్రాణము ల్విడిచి గ్రక్కున భర్తను గూడఁగా శుభ
స్థితి మెయిఁ జన్న యీసతివిచిత్రచరిత్రము దుఃఖహేతువే
పతిఁ గడవంగ దైవతము భామల కెందును గల్గనేర్చునే?

28


ఆ.

మగఁడు లేక యింట మలమల మఱుఁగుచు, నీలతాంగి యుండె నేనిఁ జూచి
మనకు నఖిలబంధుజనులకు నొక్కనాఁ, డైన శోకవహ్ని యాఱు టెట్లు?

29


క.

పురుషవిహీన లయినయా, తరుణులదైన్యముల కడలఁ దగుఁ గాక మది
న్బురుషానుమరణపుణ్యో, త్తర యగునీసాధ్వి వగవఁ దగియెడునదియే?

30


వ.

అని శత్త్రుజితుండు పలికినపలుకులం బుత్రమరణప్రకారం బెఱింగి కువలయాశ్వ
జనని జనితహర్షయై పతిం జూచి యి ట్లనియె.

31


చ.

మనమున భీతగోద్విజసమాజముఁ గావఁగఁ బూని యాజి న
స్త్రనిచయదారితాంగు లయి చచ్చువినిర్మలధర్మకర్మఠుల్
మనుజులు గాక రోగముల మ్రంది గృహంబులయందు బంధు లే
డ్వ నిలుగుకష్టులు న్నరులె వారలతల్లులు తల్లులే మహిన్.

32