పుట:మార్కండేయపురాణము (మారన).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దన వీలుండదు. శంకరకథకంటే నీపూర్వకథయే సందర్భశుద్ధిగ నున్నది. శంకరకవి హరిశ్చంద్రచరిత్రములోని కంటె మార్కండేయపురాణ హరిశ్చంద్రకథలోని విశ్వామిత్రపాత్రము చక్కఁగఁ బోషింపఁబడి యున్నది. ఇది రసికు లెఱుంగనిది కాదు.

మార్కండేయపురాణము

బ్రాహ్మ, పాద్మ, వైష్ణవ, శైవ, భాగవత, నారదీయ, మార్కండేయ, ఆగ్నేయ, భవిష్య, బ్రహ్మకైవర్త, లైంగ, వారాహ, స్కాంద, వామన, కౌర్మ, మాత్స్య, గారుడ, బ్రహ్మాండము లనుపదునెనిమిదిపురాణములలో మార్కండేయపురాణ మేడవది. నిరుపమ మగునిష్ఠతో మార్కండేయుఁడు తప మాచరించుతఱి వ్యాసమహర్షి శిష్యుఁడును విద్యానిపుణుఁడు నగుజైమిని యాతని దర్శించి “సర్వలోకరక్షాధురంధరుఁడు శ్రీవిష్ణువు మనుష్యత్వ మేల నొందె? పాండవపంచకమునకు ద్రౌపది యొక్కతె యెట్లు కుటుంబినియయ్యె? బలరామునకుఁ దీర్థయాత్రల కరుగుతఱి బ్రహ్మహత్య యెట్లు ప్రాప్తించె? పాండవేయు లగు ద్రౌపదీతనయులు గృహస్థాశ్రమ మవలంబింపకమున్న యేల గతించిరి? ఈ సందియములు భారతము పఠించుటచే నాకుఁ గలిగినవి వీనిం దీర్పు" మన మార్కండేయుఁడు "మా కిది యనుష్ఠానకాలము గాన వింధ్యపర్వతమున ధర్మపక్షులు గలరు వారివలన నీసందియము తీఱు” నన జైమిని యట్ల వింధ్యానగవాసు లగుఁ బక్షులఁ బ్రశ్నింప నాల్గవప్రశ్నకుఁ బ్రత్యుత్తరముగ హరిశ్చంద్రచరిత్రము వాక్రుచ్చిరి. జైమిని మఱల ధర్మపక్షులను డాసి జీవులగర్భజన్మకర్మానుభవాదులం గుఱించి ప్రశ్నింపఁ బితాపుత్రసంవాద మనునుపాఖ్యాన మారంభించి క్రమముగఁ బిండోత్పత్తి జననమరణములు నరకాదిగతులు కీటపక్షిగర్దభాదిజన్మంబులు మదాలసాపుత్రుం డైనయలర్కునకు దత్తాత్రేయుఁడు బ్రహ్మవిద్య నుపదేశించుట లోనగువిశేషములు వాకొన జైమిని యాశ్చర్యమంది క్రమ్మఱ సృష్ట్యాదులఁ గూర్చి ప్రశ్నింప మార్కండేయుండు క్రోష్టికి నుపదేశించిన తెఱంగున సృష్టిప్రళయములను స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాష, వైవస్వతు లనుభూతవర్తమానమనువుల యంతరమును జెప్పిరి సురథుఁ డనురాజు రాజ్యభ్రష్టుఁడై మృగయామిషంబున మేధోమహాముని యాశ్రమసమీపముఁ జేరి సమానచింతుఁ డగుసమాధి యను వైశ్యుని గలసికొని పరస్పరసుఖప్రశ్నలు ముగించికొని తమ యవస్థలఁ దన్మునికి విన్నవించి దేవ్యుపాసనముచే నుత్తమగతిఁ బడసిరను కథయు, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, భౌత్యులను కాఁగలమనువుల జన్మాదివృత్తాంతము సూర్యప్రభావమున కుదాహరణముగ రాజ్యవర్ధనచరిత్రము, వైవస్వతమనుసంతతిజాతు లగువృషధ్ర, నాభాగ, వత్సంధ్ర, ఖనిత్ర, క్షుప, కరంధ, నూవేక్షిత మరుత్తచరిత్రములను ధర్మపక్షులు జైమినికిఁ దెలిపిరి. మారన మూలమునుండి యింతవఱకె యాంధ్రీకరణ