పుట:మార్కండేయపురాణము (మారన).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇట్లే పరిశోధించినఁ దిక్కనసోమయాజి పద్యములపోలిక గలపద్యములు మార్కండేయపురాణమునఁ గలవు. దీనిచే గురునికవిత్వముపై శిష్యున కెంతయాదర మున్నది గ్రహింపవచ్చును. నన్నయభట్టారకుఁడు మొదలు శ్రీనాథకవివఱకుఁ గలమహాకవులగ్రంథములలో సామాన్యముగ గురుస్తుతి కానరాదు. ఇది యాకాలమున ననుచారముగ లేదని తోఁచుచున్నది. గురుస్తుతి అల్లసాని పెద్దననాఁటనుండి యథేచ్ఛగ గ్రంథములలోఁ జలిపి రని యూహింపవచ్చును. ఈమార్గమున కల్లసాని పెద్దనకుఁ ద్రోవఁ జూపినవాఁడు మనమారనకవియే. ఒకగురుస్తుతికే కాదు స్వారోచిషమనుసంభవకథాదాతయు నూతనభావప్రదాతయు నీతఁడే అల్లసానికవి మార్కండేయపురాణమునందుఁ బ్రమాణభావముఁ గలవాఁడని యాతనిపద్యరచనవలన స్పష్టపడుచున్నది.

ఉ.

ఈసుకుమారుఁ డెవ్వఁడొకొ యిందుల కెందులనుండి వచ్చెనో
భాసురరూపకాంతి జితభావజచంద్రుఁ డితండు రాగలీ
లాసరసత్వ మొప్పఁ గడులాలసుఁడై ననుఁ జూచె నేని నేఁ
జేసినపుణ్య మెవ్వరును జేయరు కాముని దక్క నేలుదున్.

(మార్కండేయ)


ఉ.

ఎక్కడివాఁడొ యక్షతనయేందువసంతజయంతకంతులన్
జక్కఁదనంబునన్ గెలువఁజాలెడువాఁడు మహీసురాన్వయం
బెక్కడ యీతనూవిభవ మెక్కడ యేలని బంటుగా మరున్
డక్కఁగొనంగరాదె యకటా నను వీఁడు పరిగ్రహించినన్.

(మనుచరిత్రము)


గీ.

అనఘ! మందార విద్యాధరాత్మజన్మ, నే విభావసి యనుదాన నెలమి నీకు
నెల్లభూతభాషలు మది నెఱుఁగునట్టి, విద్యయును నన్ను నిచ్చెద వేగఁ గొనుము.

(మార్కండేయపురాణము)


గీ.

అనఘ! మందారవిద్యాధరాత్మభవను, నను విభావసి యండ్రు గంధర్వవరులు
తెలిసియుండుదు నిమ్మహీతలమునందుఁ, బరఁగు మృగపక్షిజాతులభాష లెల్ల.

(మనుచరిత్రము)

పై నుదాహరించినపోలికలచేఁ బెద్దనకవియు మారనయందుఁ బ్రమాణభావము కలవాఁ డని యూహింపవచ్చును ప్రౌఢకవి మల్లన తనరుక్మాంగదచరిత్రమున వర్ణించిన యమలోకవర్ణ నముగూడ మార్కండేయపురాణములోని ద్వితీయాశ్వాసమునుండి సంగ్రహింపఁబడిన దని వివిధాధారములచే స్థాపింపవచ్చును. వ్యాసము విస్తరమగు నని సూచించితిమి. శంకరకవి హరిశ్చంద్రోపాఖ్యానము, మట్ల అనంతభూపాలుని బహులాశ్వచరిత్రము, పెద్దన మనుచరిత్రము, నీమార్కండేయపురాణమునుండి గ్రహింపఁబడినకథాభాగములు గలవని తెలియుచున్నది శంకరకవి హరిశ్చంద్రకథకు నీపురాణమందలికథకు వ్యత్యాస మెక్కుడుకలదు. మార్కండేయపురాణములోని హరిశ్చంద్రకథ ననుసరించి సంస్కృతమునఁ జండకౌశిక మనునాటకము వ్రాయఁబడినది. సమష్టిమీఁద నీనాటకము మార్కండేయపురాణకథ కెక్కుడుమార్పుఁ గల