పుట:మార్కండేయపురాణము (మారన).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అక్కలఫలం బిట్టిద యయ్యెనేని ధర్మసహాయత్వంబు లేదు గాక నిక్కంబును మనకు
దేవబ్రాహ్మణ ప్రసాదంబును సత్యధర్మజ్ఞానానృశంస్యంబులును గలిగినయట్లైన నీయట్టి
పరమథార్మికుండు రాజ్యపరిభ్రంశంబు నొంది యీదురవస్థం బడునే? యని దుఃఖిత
యగునద్దేవికి నన్నరపతి దనకన్నకలతెఱం గంతయు నెఱింగించి యయ్యింతివలనం
బుత్త్రమరణప్రకారం బెల్ల నేర్పడ విని నిట్టూర్పులు నిగుడ నత్యంతసంతాపాంత
రంగుండై శైబ్య నాలోకించి వంశకరుం డైనయీయొక్కశిశువును దైవగతిం బోవ
వగలకుం గొలు వగుచుఁ గుందం జాల వీనియెడలితోడన యనలంబునం బడియెద
నన్నేలినచండాలునియనుజ్ఞ లేకున్న నింకొక్కపుట్టువున నైన వానికి బంట
నయ్యెద నీదుర్మరణంబునం జేసి యనేకఘోరనరకంబు లైనను ననుభవించెద దాన
యజనయాజనగురుపూజనంబు లొనరించినవాఁడ నైతినేని పరలోకంబున నైన
మన మెప్పటియట్ల కూడి యుండెదము వినుము నగియును నే నెన్నండును బొంకు
పలుక నా కిదియ నిశ్చయంబు నీకు ననుజ్ఞ యిచ్చితి నీ వరిగి యమ్మహీదేవు దేవునిం
బోలె నారాధింపు మని పలికిన నపు డయ్యింతి గరం బలఁగి యిట్లనియె.

264


తే.

కొడుకు నీవును జిచ్చునఁ బడఁగఁ జూచి, యేను జీవంబుతో నుందునే నరేంద్ర?
నాకలోకసుఖం బైన నరక మైన, ననుభవింతును నీతోడ నరుగు దెంతు.

265


క.

అనవుడు నొడఁబడి విభుఁ డిం, ధనములు పొదగా నొనర్చి దానిపయిఁ దనూ
జుని నీడి భార్యయుఁ దన పిఱుఁ, దన నిలువం గేలు మొగిచి తత్పరమతియై.

266

హరిశ్చంద్రునొద్దకు సకలదేవతలు వచ్చి తత్సుతుఁ బ్రతికించుట

సీ.

స్మితమధురాననశ్రీరమ్యు ధవళవిశాలాక్షు రుచిరకపోలఫలకు
రమణీయనాసాభిరాముని శ్రీవర్ణకర్ణుఁ దామ్రాధరకాంతిసుభగు
నాజానులంబమహాబాహుపరిఘు విస్తీర్ణదృఢోరస్కు సింహమధ్యు
ఘనతరకటిచక్రుఁ గమనీయజంఘుని శోభనాంభోరుహస్ఫురితచరణు


తే.

హారకేయూరమణిమకుటాదివివిధ, దివ్యభూషణదీప్తిదేదీప్యమాను
శంఖచక్రగదాపద్మశార్ఙ్గముసల, ఖడ్గవనమాలికాచిహ్ను ఘనసవర్ణు.

267


క.

నారాయణుఁ బీతాంబరు, శ్రీరమణీరమణు భక్తచింతామణి దు
ర్వా విపద్ధ్విషకుంభవి, దారణనిపుణాభిధానదైవతసింహున్.

268


సీ.

తలఁచుచు నున్న యాధరణీశునొద్దకు ధర్ముండు మొదలుగాఁ దత్క్షణంబ
వాసవప్రభృతిగీర్వాణు లంభోరుహభవుఁడును సకలదిక్పతులు నాగ
గరుడగంధర్వకిన్నరసిద్ధసాధ్యులు విశ్వులు రుద్రులు నశ్విబుధులు
మఱియును గలయట్టిమాననీయామరు లాకౌశికుఁడు వచ్చి రపుడు ధర్ముఁ


తే.

డోహరిశ్చంద్ర! సాహస ముడుగుమయ్య!, నీతితిక్షాతపస్సత్యనిష్ఠ కేను
మెచ్చి వచ్చితి సుర లెల్ల వచ్చినారు, వీరె యని చూపె నప్పుడు వేల్పుఱేఁడు.

269


ఆ.

కుసుమవృష్టితోన కురియించె నపమృత్యు, హరణనిపుణ యైనయమృతవృష్టిఁ
బుడమిఱేనిముద్దుఁగొడుకుపై నభమున, దివ్యతూర్యరవము దివురుచుండ.

270