పుట:మార్కండేయపురాణము (మారన).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అలరుమొగంబుతోడఁ గడు నర్మిలి నా కెదు రేల రావు చే
తులు పచరించుచుం దనువుధూళి మెయిం దొరయంగ నేల న
న్నెలమిని గౌఁగిలించుకొన వెంతయుఁ దీ పెసలార మంజులో
క్తులచవి యేల నా చెవులకుం జవిఁ జూపవు నీవు పుత్రకా!

253


చ.

అనుచుఁ దనూజు నెత్తికొని యక్కునఁ జక్కఁగఁ జేర్చి మోము మో
మునఁ గదియించి బాష్పజలము ల్పొరిఁ బెల్లుగ నించి యేడ్చు హా!
యని యకటా! కుమార! తెగ నమ్మితిఁ బాపము చేసి చీర య
మ్మినయటు లిట్టు నిన్వెదకి మ్రింగునె దైవము క్రూరసర్పమై.

254


క.

నీ విటుగాఁ జూచియు నా, జీవ మెడల దున్నయపుడు చిత్తమ్మున మో
హావేశము తండ్రులకు స్వ, భావము సు మ్మిట్లు సుతులపై సుగుణనిధీ!

255


తే.

నెఱయ నర్మిలి నెనయునీ నెమ్మొగంబు, ఘనభుజంగవిషవ్యాప్తి గాజువాఱి
రాహుకబళితరోహిణీరమణుమాడ్కి, నుండఁ గనుఁగొని యే నెట్లు నుందుఁ గుఱ్ఱ.

256


వ.

అనుచు నత్యంతశోకాగ్నిసంతప్తుం డై మహీతలంబునం బడిన నద్దేవి కొడుకువలని
శోకంబు విడిచి జీవితేశ్వరుజుగుప్సితం బైనచండాలభావంబుఁ జూచి విస్మయంబు
ననుతాపంబును దైన్యంబును గా ని ట్లనియె.

257


తే.

పొడువు నిడుదయు నై కడుఁ బొలుచునితని
ముక్కుతుద యంతయును గడు నొక్కువడియెఁ
గుసుమముకుళసన్నిభరదాంకురము లింత
కంది యొవ్వెడునే దైవఘటన యకట!

258


క.

దేవసమానుం డగునీ, భూవిభునకు సకలరాజపుంగవునకు ని
ట్లేవపుఁజండాలత్వముఁ, గావించినదైవమునకుఁ గరుణయుఁ గలదే.

259


క.

కరితురగరథపదాతులుఁ, గర మమర సితాతపత్రకాంచనమయచా
మరములు పొడగాన మహీ, శ్వర! యెక్కడ నడఁగె నీదువైభవ మెల్లన్?

260


సీ.

రవి దాఁచి చూడంగ నవునట్టినీమేన నొదుగుమాలిన్యంబు గదిరి యుండ
శత్రుభీకర మైనశాతాసి నమరునీకేల నీచపుబరిగోల యుండ
లలితమకుటదీప్తిఁ బొలుచునీశిరమున శవసమర్పితమాల్యసమితి యుండ
విమలదివ్యాంబరావృతి నొప్పునీకటిఁ గుత్సితం బగుబొంతకోక యుండఁ


తే.

జేసెనే దైవ మానతక్షితిపశేఖ, రప్రభాజాలసతతవిరాజమాన
చరణకమలసుందర! హరిశ్చంద్ర! సకల, బుధమనఃకైరవాకరపూర్ణచంద్ర!

261


క.

విలసితమణిహర్యస్థల, ములఁ దగ విహరించునీకు భూతపిశాచా
కులశవధూపవృతాంబర, తల మగుప్రేతాలయంబు ధామం బయ్యెన్.

262


తే.

అనుచు నత్యంతమోహశోకార్తి నొంది, నాథు మెడ వట్టికొని యేడ్చె నలినవదన
యకట కల యిట్లు నిక్కల యగునె? యనుచుఁ, బనవె విభుఁ డెట్టికల గంటి పార్థివేంద్ర!

263