పుట:మార్కండేయపురాణము (మారన).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీదుస్స్వప్నము నెపమున, నీదుర్దశకంటె నింక నేదెస యగునో!

241


తే.

అనుచు నెంతయుఁ దలరి యమ్మనుజవిభుఁడు, మోడ్పుఁగేలు శిరంబున మోపి వేల్పు
లార! యెప్పుడు నేకీడు చేరకుండఁ, గరుణ ననుఁ బుత్రు నింతిని గావరయ్య!

242


క.

అని పలికి నృపతి శవవే, తనకారణమునను నంత దలఁపును జెడి భా
ర్యను బుత్రు మఱచి ప్రేతస, దనసంచరణంబునందుఁ దత్పరుఁ డయ్యెన్.

243


వ.

అంత నమ్మహీవల్లభువల్లభ యొక్కనాఁడు.

244


చ.

ఉరగముచేతఁ జచ్చినతనూద్భవునిం గొని శోకవేదనా
పరవశయు న్వికీర్ణకచభారయు నుద్దత బాష్పపూరయు
న్గదరతలతాడితాస్యయును గద్గదికావికలార్తనాదయు
న్జరణవిపర్యయాపగతసత్వరయానయు నై పొరిం బొరిన్.

245


వ.

ఏడ్చుచుం బరేతనికేతనంబున కేతెంచి యక్కుమారు నొక్కయెడ నీడి కూర్చుండి.

247

మృతపుత్రులైన చంద్రమతీహరిశ్చంద్రులు శ్మశానమున దుఃఖించుట

ఉ.

బోరనఁ బొంగి శోకరసపూరము నిర్భరబాష్పపూరము
ల్వారక కన్గవం దొరఁగ వాతెఱ లాలలు గ్రమ్ము దేర హా
హారవము ల్సెలంగ విరియంబడి వేనలి ధూళి బ్రుంగ న
క్కూరిమిపట్టిఁ బేర్కొనుచుఁ గోమలి మేదినిఁ జేతు లూఁదుచున్.

247


సీ.

బహువిధంబులఁ బ్రలాపం బొనర్చుచు నేడ్చుసతియేడ్పు విని డాయఁ జని విభుండు
కార్చిచ్చు సోఁకినఁ గంది మ్లానత్వంబుఁ బ్రాపించుదీవియరూపు నొంది
యున్నట్టివనితఁ దదుత్సంగమున నున్న యహివిషవ్యపగతప్రాణుఁ డైన
సూనునిఁ జూచి యించుకయు నెఱుంగక యబ్బాలు శుభలక్షణావలులకుఁ


తే.

జోద్యపడి యేనరేంద్రునిసుతుఁడొ వీఁడు?
కాలుఁ డెటు మ్రింగెనో వీనిఁ గరుణమాలి?
యనుచు మదిలోనఁ దలఁచి యాఘనుఁడు లోహి
తాస్యుఁ డింతకు నింత ప్రాయంపువాఁడు.

248


తే.

వాఁడు గాఁడు గదా బలవంతుఁడైన, యంతుకునిచారిఁ బడి యిటు లైనవాఁడు
నాఁగ నద్దేవి మఱియు నానావిధములఁ, గొడుకుఁ బనపుచు నాథుఁ బేర్కొనుచు నడలి.

249


క.

అక్కట! దైవము రాజ్యము, ద్రెక్కొని యాలిం దనూజుఁ దెగ నమ్మంగా
నెక్కొలిపి హరిశ్చంద్రుని, నిక్కడఁ గాడ్పఱిచె నింక నేగతిఁ బోదున్?

250


చ.

అని పలుక న్విభుండు విని యప్పుడు దా మది వారల న్నిజాం
గనయు సుతుండు గా నెఱిఁగి గ్రక్కునఁ జేష్ట యడంగి కూలె నే
ల నతని నాథుఁగా నెఱిఁగి లాలలు వాదొరఁగంగఁ దీవ్రరో
దన మొనరించుచుం బడియెఁ దామరసానన మూర్ఛ గప్పినన్.

251


వ.

ఇట్లు మూర్ఛిల్లి యిరువురు గొంతవడికి నొక్కటఁ దెలివొంది రంత న న్నరేం
ద్రుఁడు నందనుం గనుంగొని.

252