పుట:మార్కండేయపురాణము (మారన).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భోరుహమిత్రుఁ డస్తగిరిఁ బొందెడుఁ బైకము చక్కఁబెట్ట కి
ట్లూరక యున్న నిత్తుఁ గడునుగ్రపుశాపము నీకు భూవరా!

209


చ.

అని ముని యేఁగినం గడుభయమ్మునఁ దల్లడ మందునాథుఁ జూ
చీ నరవరేణ్య! నన్ను నెడసేయక యమ్మి ఋణమ్ము దీర్పు క్రో
ధనుఁ డగుచున్న కౌశికునిదారుణశాపముపాలు గాకుమీ
యని పలుమాఱు వేఁడుకొనునంగనమాటకు రాజు పొక్కుచున్.

210


క.

మనమున రోఁతయు నొడఁబాటును బెనఁగొని మిక్కుటంపుడోలాయనముం
బెనుపఁగ ననృతభయంబును, మునిశాపభయంబు వనట ముంప వికలుఁడై.

211


ఆ.

ఎట్టకేల కమ్మహివిభుండు మనమునఁ, దెగువఁ జేసి మగువమొగముఁ జూచి
యకట! నిర్దయాత్ములైననృశంసులఁ, బోల కేల నాకుఁ బోవ వచ్చు?

212


క.

నిను నమ్ముకొనియెదం బద, వనరుహదళనేత్ర! యనుచు వారాణసి చొ
చ్చి నరేంద్రుఁడు బాష్పంబులు, గనుఁగవ వెల్లిగొన నెలుఁగు గడలుకొనంగన్.

213

హరిశ్చంద్రుఁ డంగడివీథిని భార్యాపుత్త్రుల నమ్ముట

సీ.

ఓపురజనులార నాపత్ని నమ్మెద నే దాసిఁగా వెల యెఱిఁగి పెట్టి
కొనుఁడు న న్నెవ్వఁడవని యడిగెదరేని నే నృశంసుండను దానవుండ
నతిపాపకర్ముఁడ నాలి నమ్ముకొనంగ నరుగుదెంచినకఠినాత్మకుండ
ననుచుండ నొక్కబ్రాహ్మణవృద్ధు చనుదెంచి మత్ప్రియాంగన సుకుమారి పనికిఁ


ఆ.

జాల దిచ్చెదేని చయ్యన వెలఁ జెప్పు, వరవు డెట్లు మాకు వలయు ననిన
విభుఁడు విపులదుఃఖవేదనఁ బలుక నో, రాడ కున్న నంత నాద్విజుండు.

214


ఆ.

తగినయంతధనము దాన యన్నరనాథు, వల్కలముల ముడిచివైచి యెడిసి
వెలుచ నాలతాంగి పెడఁబాయఁ దలవట్టి, యీడ్చె నీడ్వ నేడ్పుటెలుఁగుతోడ.

215


ఆ.

విడువవయ్య తండ్రి! తడయక వచ్చెద!, వీఁడె నన్నుఁ జూచి వెగచి వెగచి
కొడుకు దద్ద వెగడు పడి యేడ్చుచున్నాఁడు, బుజ్జగింతు ననుచుఁ బుత్త్రుఁ గాంచి.

216


క.

అన్నన్న! నన్ను ముట్టకు, మన్న! నృపతనూజ! దాసి నశుచి ననుచుఁ బైఁ
గన్నీరు వెల్లిగొనఁగా, నున్న జననికొంగు బాలుఁ డుడుగక పట్టెన్.

217


తే.

పట్టి విడువక యేడ్చినఁ బట్టి తల్లి, పెట్టి పోఁ జాల కర్మిలి పెద్ద యడలి
విప్రుఁ గనుఁగొని వీనిని విలువవయ్య!, గోవుతోడన వత్సముఁ గొనువిధమున.

218


వ.

అని యద్దేవి యత్యంతదీనానన యై ప్రార్థించిన నతండు శాస్త్రవిదులు పురుషునకుఁ
బెక్కువేలుమాడలు నంగనకు నర్థంబునుం చెప్పుదురు గావున నిక్కుమారునకు వేన
వేలుమాడలు గొను మని యన్నరపతి కిచ్చి యయ్యిరువుర నీడ్చుకొని పోవం
గనుంగొని నిట్టూర్పు లందంద సందడింప వీపులు వేదనాదూమానమానసుం
డగుచు నమ్మానవేంద్రుండు.

219