పుట:మార్కండేయపురాణము (మారన).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనిలుఁడు నర్కుఁడు న్శశియు నైనను గానరు మున్ను దన్ను న
త్యనుపమరాజ్యభోగమహిమాతిశయంబున నట్టికాంత నేఁ
డినకులరత్న మై వెలుఁగునిట్టిసుతుండును దాను నాకతం
బున వరవుందనంబునకుఁ బోయెనె యేగతిఁ బోదు దైవమా!

220


మ.

అని దుఃఖింపఁగఁ గౌశికుం డచటి కుద్యద్వేగుఁ డై వచ్చినన్
జననాథుం డిదె సొమ్ము కొమ్మనిన నాస్వల్పార్థముం జూచి కో
పనుఁ డై యంతట దక్షిణాధనము సంపన్నంబుగాఁ జేసితే
నను గారించెదవేల? యింకఁ దడ వైనం శాప మిత్తుం జుమీ!

221


ఆ.

ప్రొద్దు జాము తక్కుపోయి నే వచ్చెద, వేయుఁ జెప్ప నేల? వేగ కొఱఁత
ధనము పెట్టవలయు నని యప్పు డిచ్చిన, ధనము గొని యతండు సనియెఁ జనిన.

222

హరిశ్చంద్రుఁడు ద న్నమ్ముకొనుట

ఉ.

ఆనరనాథుఁ డప్పుడు భయమ్మున శోకము నగ్గలింపఁగా
దా నెద నాత్మవిక్రయము దక్క ధనంబున కేయుపాయముం
గానక నిశ్చయించి యధికధ్వని ని ట్లను నన్ను నమ్మెద
న్మానుగ నెవ్వ రైనను ధనం బిటు దెండు గొనుండు నావుడున్.

223


వ.

అయ్యవసరంబున ధర్ముండు రయంబున.

224


మ.

నిడుమోముం గుఱుగేలు గుండకడుపు న్నీలత్వము న్మిట్టలు
న్గడుదీర్ఘంబులు నైనదంతములు పింగశ్మశ్రుకేశంబులు
న్జెడుగుంగంపును గల్గి హేయ మగునీచీభావముం దాల్చి తా
జడక ల్లట్టి నికృష్టయష్టికరుఁ డై చండాలవేషంబుతోన్.

225

కొనవచ్చినచండాలునకును హరిశ్చంద్రునకునైన సంవాదము

క.

ఇల గోలఁ దట్టుచు న్సం, బళి సంబళి యనుచుఁ గ్రందుపడుజనములకు
న్దొలఁగుచు నొదుఁగుచు నాభూ, తలపతికడ కరుగుదెంచి తా ని ట్లనియెన్.

226


సీ.

నేను జండాలుఁడ నృపవర! పురమున వీరవిఖ్యాతుఁడ ధీర! వినుము
చంపఁగఁ దగువారిఁ జంపెడివాఁడఁ జచ్చినవారిమొగములచీర లెపుడుఁ
గొనియెడివాఁడ నెక్కుడుసొమ్ము గలవాఁడ నెంతయర్థం బైన నిచ్చి నిన్ను
విలిచెదఁ జెప్పుమా వెల యన్న నారాజు మాలను సేవించి మనుటకంటెఁ


తే.

గౌశికోగ్రశాపాగ్నిచేఁ గ్రాఁగి పోవు, టైన మేలని తలఁప నమ్మౌని యరుగు
దెంచి నృపుఁ జూచి నాయప్పు దీర్ప రాదె, యధికధనము నీ కిచ్చు వీఁ డనిన విభుఁడు.

227

చండాలదాస్యమునకై కౌశికహరిశ్చంద్రసంవాదము

క.

ఇనవంశంబునఁ బుట్టిన, మనుజేంద్రుఁడ నఖిలలోకమాన్యుఁడఁ గొఱమా
లినమాలని నకట! తపో, ధనసత్తమ! యేను గొలువఁ దగునే? చెపుమా.

228