పుట:మార్కండేయపురాణము (మారన).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వలయుం గావున మీరు బ్రహ్మచారులై కామక్రోధలోభమోహమదమత్సరంబులం
బొరయక యల్పకాలంబున శరీరంబులు విడిచి దేవభావంబులు గైకొండని
యనుగ్రహించె నది కారణంబుగ విశ్వు లేవురు ద్రౌపదిగర్భంబునఁ బాండునందను
లేవురకు నుద్భవించి వివాహంబులు లేక దీర్ఘాయుష్యులు గాక చచ్చి రని చెప్పి
యప్పక్షివరులు భవత్ప్రశ్నంబు లన్నింటికి నుత్తరంబులు చెప్పితి మింక నేమి
వినవలతు చెప్పు మనిన జైమిని యి ట్లనియె.

187


తే.

అమ్మహారాజు దుస్సహ మైనయట్టి, దుఃఖములఁ బొంది యక్కటా! తుది సుఖంబు
లనుభవించెనె యెప్పటియట్ల వినఁగ, వేడ్క యయ్యెడుఁ దత్కథవిధముఁ జెపుడ.

188


చ.

అనవుడుఁ బక్షు లిట్టు లని రమ్మునివల్లభుతోడ గాధినం
దనుపటురౌద్రవృత్తి గని తల్లడ మంది పురీజనంబు లె
ల్లను దరియింప రానివగల న్దురపిల్లుచు నప్డు క్రమ్మఱం
జని రటు లార్తుఁ డై నృపతిసత్తముఁ డాలు సుతుండుఁ దోడ రాన్.

189

హరిశ్చంద్రుఁడు కాశి కేఁగుట

చ.

తొలఁగనిసత్యధర్మములు తోడుగఁ దాలిమి యూఁది దుఃఖమ
న్జలనిధిఁ గూలుచు న్వివిధశైలములు న్నదులు న్మహావనం
బులును నతిక్రమించి యట భూవరుఁ డీశనివాసము న్మహీ
తిలకము సర్వమంగళము దివ్యము ముక్తిపదంబు నై భువిన్.

190


క.

కర మొప్పెడు కాశీపుర, వరముఁ బ్రవేశించునెడ నవారితతేజ
స్స్ఫురణోగ్రుఁ గౌశికుం గని, ధరణీశుఁడు మ్రొక్కుటయు నతం డి ట్లనియెన్.

191

రాజు కాశియందుఁ గౌశికునిర్బంధమునం జింతాకులుం డగుట

తే.

నీవు నుడివిననెల నిండె నేఁటితోడ, నేది మాసొమ్ము తెమ్ము మహీతలేశ!
యనిన నింకను దినమునం దర్ధమున్న, యది సహింపు మునీంద్ర! నీ వంతదాఁక.

192


క.

అనవుడు నౌఁగా కని య, మ్మునిపతి వోవుటయు రాజముఖ్యుఁడు చేతో
వననిధి పిండలిపిండుగ, ఘనచింతామంథరంబు గలపఁగ మదిలోన్.

193


సీ.

ఈమునీంద్రున కర్థ మీరెండుజాముల కెక్కడ సవరింతు? నెందుఁ జొత్తు?
నెడరు దీర్పఁగ బంధు లెచ్చటఁ గల రిప్పు? డెవ్వరి నడుగుదు హీనవృత్తి?
నెట్టు దట్టుదుఁ బ్రాణ? మేదెస పోదు? నే నెయ్యడ నడఁగుదు నింక? నకట!
నెలమితో విప్రున కిచ్చెద నని పల్కి యీ కున్నఁ గ్రిమిజన్మ మిపుడ వచ్చు


తే.

నేమి సేయుదు? ననుచు నరేంద్రుఁ డలఁత, నెరియుచును మోము వ్రాల్చిననింతి యేడ్పు
టెలుఁగుతోఁ గన్నుఁగవ నశ్రు లొలుక జీవి, తేశుఁ గనుఁగొని సుదతి తానిట్టులనియె.

194


తే.

ధీరమతి వీవు నిట్లు చింతింపఁ దగునె?, సత్యపాలన మొనరింపు సత్యహీనుఁ
డైనపురుషుదేహము దా శ్మశానతుల్య, మధిప! మేటిధర్మంబు సత్యంబ యండ్రు.

195


క.

ఒనరఁగ హయమేధము లే, డొనరించితి రాజసూయ ముజ్జ్వలవిభవ