పుట:మార్కండేయపురాణము (మారన).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనుచు నంతకంతకు నతిశయిల్లు నెవ్వగలపెల్లున నుల్లంబులు పల్లటిల్ల నందంద
క్రమ్ము నశ్రుజలంబులవెల్లి మునింగి మొగంబులు దీనంబు లగుచుండ నొండొండ
యడరుగద్గదికం జేసి వికలంబులై యాక్రందనారావంబులు చెలంగు నంగంబు లవ
శత్వంబు నొంది యొరగ నప్పురజనంబు లెల్ల నమ్మహావిభు డాయం బోయి.

178


క.

ధరణీశ్వరులకు ధర్మం, బరయంగాఁ బ్రజలయార్తి యణఁచుటయె కదా
ధరణీశ్వర! యే మార్తిం, బరితాపముఁ బొందఁ జనుట పాడియె నీకున్.

179


ఉ.

ఊరక యేల పోయెదు? నృపోత్తమ! దీనుల మమ్ముఁ జూడవే
కారుణికాగ్రగణ్యుఁడవు గావె? ముహూర్తము నిల్చి నీముఖాం
భోరుహవిభ్రమంబు దనివోవఁగఁ గ్రోలి మదీయలోచనో
దారమధువ్రతాళి ముద మందెడునట్టులుగా నొనర్పవే.

180


ఆ.

మార్గజనితరేణుమలిన మై నీముఖాం, భోజ మింకఁ జాలఁ బొలుపు దఱిఁగి
వాడి తొంటియంత చూడఁగా నొప్పక, యుండు నేఁగ వలవ దుజ్జ్వలాంగ!

181


చ.

అని కరుణంబుగాఁ బురజనావలి పల్కుచు రాఁ దదీయవా
క్యనిచయశృంఖలం దవిలి యమ్మెయిఁ బోవఁగఁ గాళు లాడమి
న్మనుజవిభుండు శోకరసమగ్నత మార్గముక్రేవ నిల్చిన
న్గనుఁగొని కౌశికుం డలిగి కన్నుల నిప్పులు రాల నిట్లనున్.

182

విశ్వామిత్రుఁడు హరిశ్చంద్రుని ధర్షించుట

తే.

ఇస్సిరో! దురాచారుని హీనసత్య, వచను ని న్నేమి చెప్ప? నా కుచితవృత్తి
నిచ్చి రాజ్యము క్రమ్మఱఁ బుచ్చుకొనఁగఁ దలఁచి నీవండగొనియెదు నిలిచి యిచట.

183


చ.

అనినఁ జలించుచు న్నృపతియంగన కే లొకచేఁ దెమల్చి వే
చనఁ జన నేమి చెప్ప మునిచందము! చేతిప్రచండదండ మె
త్తి నయ మొకింత లేక సుదతీతిలకంబుకృశాంగవల్లి నే
సె నిభము దొండ మెత్తి మదజృంభిత మై లత వ్రేయుచాడ్పునన్.

184


తే.

దాని కత్యంతశోకాగ్నితప్తుఁ డగుచు, నరిగెఁ గాని యించుకయు నొండాడఁడయ్యె
నధిపుఁ డప్పుడు విశ్వాఖ్యు లైనవేల్పు, లేవు రమ్మునిసంరంభ మెల్లఁ జూచి.

185


ఉ.

అక్కటికంబు డెందములయందు జనింపఁగ వచ్చి యక్కటా!
యిక్కమలాక్షి సాధ్వి నిటు లేటికి మోఁదెడుఁ జేతికోల? నిం
కెక్కడిపుణ్యలోకముల కేఁగెడు నిమ్ముని సత్యనిష్ఠఁ బెం
పెక్కినయన్నరేశ్వరుని నేమిటి కిమ్మెయిఁ గాసిపెట్టెడిన్.

186

విశ్వామిత్రునిశాపమున విశ్వేదేవతలు ద్రౌపదేయులై జనించుట

వ.

అనిన నప్పలుకులు విని విశ్వామిత్రుండు రోషారుణితలోచనుం డై యవ్విశ్వనామ
దేవతలఁ జూచి మనుష్యపక్షపాతంబున నన్ను ధిక్కరించితిరి మనుష్యులు గండని
శపియించి తోన ప్రసన్నత్వంబు గైకొని మీకు సంతానంబు నుర్వి నుండకుండ