పుట:మార్కండేయపురాణము (మారన).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పై పద్యమువలన గన్నయనేనాని వారవధూలంపటుఁ డని తెలియుచున్నది. అందులకు లక్ష్యము మఱికొన్ని విశేషణములు మారన వాకొనియున్నాఁడు. చూడుఁడు.

భామినీచిత్తధామాః భామినీపంచబాణా; మారాస్త్రదళితచేతో, నారీజనసుప్రసన్న; ప్రౌఢస్త్రీమకరాంశా; కామినీభద్ర; బాలారతికేళీపాంచాలా;

గన్నసేనానియందు వారస్త్రీలోలత్వ మున్నటుల పైవిశేషములతో బలపఱుపవచ్చును మనసేనానికిఁ బాలకుఁ డగు ప్రతాపరుద్రచక్రవర్తియు వారకాంతాలోలుఁ డని వల్లభామాత్యుని క్రీడాభిరామము వాకొనుచున్నది.

శా.

ద్వీపాంతంబున నుండి వచ్చితివె భూదేవా! 'ప్రశాంతం మహా
పాపం' సర్వజగత్ప్రసిద్ధసుమనోబాణాసనామ్నాయవి
ద్యోపాధ్యాయి ప్రతాపరుద్రధరణీశోపాత్తగోష్ఠీప్రతి
ష్ఠాపారీణ నెఱుంగ వయ్యెదవు మాచల్దేవివారాంగనన్.

(క్రీడాభిరామము)

కాకతీయుల రాజ్యవిజృంభణకాలమందు పలువురు సేనానాయకులు తలవరులు దేవళములు కట్టించి కృతులు స్వీకరించి దానము లొనర్చి స్థిరకాయు లైరి. వారివారిపవిత్రజీవితాదర్శములు నేఁటికిఁ గనుమాయకున్నవి.

మారనకవి

ఇతఁడు తిక్కనసోమయాజిపుత్త్రుఁ డని కొంద ఱనుచున్నారు. ఇది సమంజసము కాదు గురునామము పితృనామము నొకటిగ నుంటచేఁ గలిగినభాంతియే యిది.

గద్య.

"శ్రీమదుభయకవిమిత్ర తిక్కన సోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర"

ఇట్లు గద్యలో మారనకవి జనకుఁ డగుతిక్కనామాత్యుని వేఱుగను, గురుఁ డగుతిక్కనసోమయాజిని వేఱుగను వాకొని యున్నాఁడు. ఇతఁ డింక నేమేనిగ్రంథము లొనరించినటులఁ దెలియరాదు కవియొక్క పవిత్రమగు జన్మస్థానమునేని తెలిసికొన నాధారములు లేవు. కవిస్తుతిలో నీతఁడు నన్నయ్యను తిక్కనసోమయాజిని మాత్రమే స్తుతిచేయుటచే నెఱ్ఱాప్రగడ భారతభాగము వ్యాప్తికి రానిభాగమున నీకవియున్నటు లూహింపవచ్చును మారన గొప్పలాక్షణికకవి. కవిత్వము సరళముగ శ్రావ్యముగ దేశీయములతో నిండియుండును రసపోషణసంవిధానమున నీకవి తనలేఖనిని మనోభావప్రకటనమునకే నియోగించుచుండును. మొత్తముమీఁద నీకవి కథాంశములఁ గౢప్తముసల్పి సముచితము లగువర్ణనలకుఁ దా వొసంగి కావ్యనిర్మాణ మొనరించుటలో మిగుల నేరుపుగలవాఁడు వర్ణనాంశములకంటె కథాంశములకె యీకవి విలువ గలతనకావ్యమునఁ దానొసంగును. ఈయంశమునను ఈతఁడు తిక్కనసోమయాజిశిష్యుఁ డని చెప్పఁదగినవాఁడె వివిధన్యాయాధ్యాత్మికకథాబంధుర మగునీపురాణమున నెటులో వీలు గలిగించికొని తనసహజకవితాధారతో నాయికల దివ్యస్వరూపములు సాత్వికశృంగార