పుట:మార్కండేయపురాణము (మారన).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ణమునుండి యార్జింతము. గన్నవిభుఁడు సేనానాయకత్వము రాజచిహ్నములు ప్రతాపరుద్రుని పరాక్రమముచే మెప్పించి యార్జించినటుల నీపద్యమువలనఁ దెల్ల మగుచున్నది

చ.

ఎలమిఁ బ్రతాపరుద్రమనుజేంద్రునిచేఁ బడసెన్ బ్రవీణుఁడై
కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిఁ గీటడంచియు
న్బలరిపుతుల్యవిక్రముఁడు నాగయగన్నవిభుండు తేజమున్
విలసితరాజచిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్.

(పీఠిక.ప.40)

దీనింబట్టి ప్రతాపరుద్రచక్రవర్తి రాజ్యపాలనమునకు వచ్చిన పిమ్మట (అనఁగా: మధ్యవయస్సున) గన్నయ సేనానాయకపదవి నొందియుండును కృతి నటుపిమ్మట స్వీకరించియుండును. ప్రతాపరుద్రుఁడు 1295 ( క్రీ. శ.) మొదలు 1321 వఱకుఁ బాలించుటచే గన్నయ కృతినందిన కాలము రమారమి 1310 ప్రాంతములలో నని యూహింపనగు.

గన్నయవంశము పరాక్రమభూషిత మైనది. ఇతనితాత మల్లవిభుఁడు సేనానాయకుఁడు. తండ్రి కాకతీయగణపతి యనుంగుతలవరి యగుమేచయకు నల్లుఁడు. తాను ప్రతాపరుద్రునిసేనాని తమ్ముఁడు ఎల్లయ్య రాజనీతిజ్ఞుఁడు. కడసారితమ్ముఁడు మేచయ ప్రతాపరుద్రుని నాని మహాధికారి ఆప్తుఁడు. ఇట్టి పవిత్రవంశసంజాతుఁ డగుగన్నయ కృతి స్వీకరింప వాంఛించుట మారనయంతకవి కృతి యొసంగుటయుఁ ద్రిలింగభాషాసుకృతము.

కృత్యాదియందలి "ప్రతాపరుద్రదేవ సామ్రాజ్యవర్ధన స్థిరవినీతికరణ కుశలుఁడు ” అను వాక్యముచే గన్నసేనాని ప్రతాపరుద్రునిచెంత రాజకీయకార్యధురంధరుఁడనియు, "కాకతిక్ష్మాతలాధీశకటకపాలుఁడు” అను వాక్యముచే గన్నసేనాపతి ఏకశిలానగరపరిపాలకుఁ డనియుఁ దెలియును గన్నయ్యసేనాని జీవితమును బరాక్రమాదికమును దెలుపు శాసనములు లేవనఁజాలము. నిజామురాష్ట్రమునందలి యాంధ్రభాగమునఁ గాకతీయుల సేనానాయకులు నెలకొల్పిన శాసనములు వేలకొలది గలవు వాఙ్మయసేవాధురంధరుఁడగు గన్నసేనాని శాసనము లింతవఱకు లభింపకుంట సంతాపకరము.

మార్కండేయపురాణము కృత్యాది, ఆశ్వాసాంతపద్యములుచూడ గన్నయసేనాని రూపవంతుఁ డనియుఁ బరాక్రమశాలి యనియుఁ బ్రభుభక్తిపరాయణుఁ డనియుఁ దేలుచున్నది. అంతియ కాక—

ఉ.

వారవిలాసినీవదనవారిజమిత్ర! సమగ్రవిద్విష
ద్భూరుహవీతిహోత్ర! గుణభూషణభూషితగాత్ర! నిర్మలా
చారపవిత్ర! సూరివనజైత్ర! వివర్థితగోత్ర! భూమిపం
కేరుహకేళిలోలసితకీర్తిరమేశ్వర పూజితేశ్వరా.

(ఆ. 7.285)