పుట:మార్కండేయపురాణము (మారన).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

చచ్చినసూతుఁ జూచి యతిసంభ్రమకంపితచిత్తులై మును
ల్విచ్చి జటాజినావలులు వీడఁగ నల్గడఁ బాఱి రంతఁ దాఁ
జెచ్చెర బుద్ధికిం తెలివిఁ జెందిన రాముఁడు వెచ్చఁ నూర్చుచు
న్వచ్చునె బ్రహ్మహత్య బలవంతపుఁగర్మము ద్రిప్పి తెచ్చెనే?

137


చ.

కరుణ యొకింత లేక యవుఁ గా దనునట్టితలంపు లేక భూ
సురుఁ డనుశంక లేక యిటు సూతుని నేఁ దెగఁ జూతునే సురా
పరిణతదుర్మదాంధ్యమునఁ బాపముఁ జేసితి దేహమెల్ల నె
త్తురుఁ బొల వల్చుచున్నయది దుస్తరపాతకసంక్రమమ్మునన్.

138


వ.

అనుచు బలభద్రుండు పశ్చాత్తాపంబునం జిత్తం బుత్తలం బొంద నప్పుడు.

139

బలరామునితీర్థయాత్ర

క.

ఈదుష్కర్మం బంతయు, నేదఁగ నెల్లెడల దీని నెఱిఁగించుచు నే
వేదవిహితవిధినియతి, న్ద్వాదశసంవత్సరవ్రతముఁ జరియింతున్.

140


వ.

అని నిశ్చయించి రేవతీప్రభృతియువతీజనంబుల వీడ్కొల్పి విధ్యుక్తప్రకారంబునం
బ్రలంబఘ్నుండు ప్రతిలోమంబుగా సరస్వతీపుణ్యతీర్థంబు లాడం జనియె నని
చెప్పి యప్పక్షివరులు ద్రౌపదేయకథాప్రకారంబు చెప్పం దలంచి యి ట్లనిరి
తొల్లి త్రేతాయుగంబునందు.

141

హరిశ్చంద్రోపాఖ్యానము

సీ.

ఎవ్వనిమాహాత్మ్య మెప్పుడు వేదము ల్చెలఁగి సుస్తోత్రము ల్సేయుచుండు
నెవ్వనిశాసనం బేడుదీవులరాజులకు శిరోభూషణలక్ష్మి నొందు
నెవ్వనిరక్ష మహేంద్రాదిసురలకుఁ బెట్టనికోట యై పెంపుదాల్చు
నెవ్వనిసత్కీర్తి యీయజాండం బెంత యంతయుఁ దానయై యతిశయిల్లు


తే.

నట్టిమహితగుణాభరణాభిరామ, మూర్తి ప్రత్యర్థినృపసమవర్తి పరమ
పూజ్యసామ్రాజ్యవైభవస్ఫూర్తి నిత్య, సత్యవర్తి హరిశ్చంద్రచక్రవర్తి.

142


మ.

ధరణీచక్ర మవక్రవిక్రమకళాదర్పం బెలర్పంగ నే
ర్పరి యై నిర్మలసత్యధర్మనియతిం బాలించె దుర్భిక్ష డం
బరదుఃఖంబులు జారచోరభయమున్మాదజ్వరవ్యాధిదు
ర్మరణాదు ల్ప్రభవింపకుండఁ బ్రజ ధర్మప్రీతి వర్తింపఁగన్.

143


క.

ధనరూపబలంబుల న, త్యనుపమవిద్యాతపోమహత్త్వంబుల భూ
జనులకు నొదవదు మద మ, జ్జననాయకుసత్యధర్మశాసనమహిమన్.

144

వేఁట కేఁగినహరిశ్చంద్రుఁడు విశ్వామిత్రుదరి కరుగుట

వ.

ఇట్లు సత్యవ్రతగరిష్ఠుండును ధర్మకర్మవరిష్ఠుండును నైనయారాజర్షి ప్రజాపాల
నంబు సేయుచు నొక్కనాఁ డరణ్యంబున కరిగి మృగయావినోదంబులం దగిలి చని
చని ముందఱ నొక్కయెడ.

145