పుట:మార్కండేయపురాణము (మారన).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

మము రక్షింపు మని పలుమాఱుఁ గూయు, నాఁడుకూయి వీ తెంచిన నానరవరుఁ
డోడ కోడకుఁ డేనుండ నొకఁడు మిమ్ము, నకట! యన్యాయవృత్తిమై నలఁపఁ గలఁడె.

146


క.

ఇదె వచ్చెద వెఱువకుఁడీ, మది నంచును వేఁట యుడిగి మనుజేంద్రుఁడు శి
ష్టదయాళుత్వంబును దు, ష్టదమనకుతుకంబు నడరఁ జనుసమయమునన్.

147


క.

ప్రారంభంబుల కెల్లను, నారయ విఘ్నము లొనర్చు నావిఘ్నేశుం
డారోదనముతెఱఁగు ము, న్నారసి తా నచట నునికి నప్పుడు మదిలోన్.

148


మ.

జతనం బారఁ దపోమహత్త్వమున విశ్వామిత్రుఁ డిట్లియ్యెడన్
సతతాభ్యాసకుతూహలాగ్ర్యనియతిన్ సాధింపఁగా విద్య లా
తతతీవ్రార్తిభయంబున న్దలఁకి యత్యంతంబు వాపోయెడిన్
ధృతి నీరాజును నోడకుం డనుచు నేతెంచెం గతం బేమియో.

149


వ.

అని యూహించి.

150


తరువోజ.

ఈరాజుఁ బ్రేరించి యీమునిరాజు, నెద నొవ్వఁ బలికించి యీతనిక్రోధ
మారంగఁ జేసెద నంత నీవిద్య, లలజడిఁ బడ కేఁగు నని నిశ్చయించి
యారాజుమది సొచ్చె నావిఘ్నరాజు, హా యని మఱియును నాయేడ్పు టెలుఁగు
లారాజు సైఁపక యతితీవ్ర కోప, హాసభీషణవక్త్రుఁ డై యిట్టు లనియె.

151


చ.

వెలుఁగుమహాప్రతాపశిఖవేఁడిమి దిక్కుల నించుచున్న నా
కొలఁది యెఱుంగ కెవ్వఁ డొకొ ఘోరపుఁజి చ్చిటు చీరఁ గట్టెడి
న్దలరక యిట్టిదుర్మదు నధర్మపరు న్దురితాత్ముఁ జండదోః
కలితధనుర్విముక్తపటుకాండవిఖండితగాత్రుఁ జేసెదన్.

152


క.

అని బె ట్టదల్చుచును డా, సిన రాజుకఠోరవాక్యశిలలు చెవులఁ దాఁ
కిన నమ్ముని పెనుగోపమున నుండెను విద్య లడఁగి పోయెం గినుకన్.

153


వ.

అట్లు డాసి యారా జాక్రందించునంగనలం గానక.

154


క.

విశ్వామిత్రుని నుద్య, ద్వైశ్వానరసదృశశమూర్తివైభవు నాధా
త్రీశ్వరుఁడు బిట్టు గని చల, దశ్వత్థదళంబుభంగి నంగము వణఁకన్.

155


క.

మ్రొక్కిన నోరి! దురాత్మక! యెక్కడ వచ్చె! దటు నిలువు మీ వనుఁడుఁ గడు
న్దక్కి నయమున మఱియును, మ్రొక్కుచు నిట్లనియె రాజముఖ్యుఁడు భీతిన్.

156


చ.

అలుగమయ్య! యోమునిజనాగ్రణి! త ప్పొకయింత లేదు నా
వలన నరే్ంద్రధర్మ మగువాక్యమ పల్కితిఁ జిత్తగింపు మ
స్ఖలితము గాఁగ నిచ్చుటయుఁ గాచుటయు న్విలు చేతఁ బట్టి ని
శ్చలత రణంబు సేయుటయు శాస్త్రమతస్థితి రాజధర్మముల్.

157


వ.

అనినం గౌశికకులసంభవుం డిట్లనియె.

158


తే.

ఎవ్వరికి నిత్తు గాతు వీ వెట్టివారి, రాజ యెవ్వరితో బవరంబు సేయు
దనిన విప్రుల కిత్తు భయార్తజనులఁ, గాతు శత్త్రులతోడ సంగర మొనర్తు.

159