పుట:మార్కండేయపురాణము (మారన).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్వారవతినుండి వచ్చె వి, చారదశాసంమిళితనిజస్వాంతుం డై.

128


ఉత్సాహ.

హరికిఁ బ్రియుఁడు నరుఁడు గాన హరి దొఱంగఁ డన్నరున్
హరిఁ దొఱంగి యేను గౌరవాధినాథుఁ గూడ నె
ట్లరుగ నేర్తుఁ బాండుతనయులందు నిల్చి కౌరవే
శ్వరుని శిష్యు నెట్లు వారు చంపఁ జూతు నక్కటా!


ఉత్సాహ.

వారు వీరు నాకు బాంధవమున నొక్కరూప యె
వ్వారిఁ గూడ నొల్ల బంధువర్గము ల్చలంబున
న్బోరఁ జూడఁ జాలఁ దీర్థములకు బోయెద న్వగం
గూరుచుండ నేల యని ముకుందునకుఁ బ్రియంబునన్.

130


వ.

అంతయు నెఱింగించి హలధరుండు వీడ్కొని నిజపురంబునకుం జని మఱునాఁడు
తీర్థసేవ సేయువాఁడై నిశ్చయించి.

131


క.

వివిధము లగుమధురసములు, చవిగొనుచుం దనియఁ ద్రావి సంఘూర్ణితచి
త్తవికారజనితమదర, క్తవిలోచనభయదవక్త్రకమలుం డగుచున్.

132


ఉ.

ఆవిభుఁ డొక్కకేల ముసలాయుధముం బెఱకేల రోహిణీ
దేవికరంబు పట్టికొని దేహరుచు ల్వెలుఁగంగ నంగన
ల్వేవురు గొల్చి రా సమదలీల మదాంధగజంబుచాడ్పునన్
రైవతశైలసానువనరమ్యతలంబునఁ గ్రీడ సల్పుచున్.

133

రైవతోద్యానవర్ణనము

సీ.

ఎనసి యొండొంటితో ననఁగి పెనంగెడు నవలతాతరుమిథునములసొబఁగు
సహకారపల్లవాస్వాదనక్రీడలు సలుపుకోకిలదంపతులబెడంగు
పొలయలుకలను దెల్పుచు నటించుచుఁ గ్రాలు విటకులటాళులవిలసనంబు
సరసదాడిమఫలాస్వాదనలీలలఁ గర మొప్ప శుకవధూవరులచెన్ను


తే.

హంసవరటామనోజ్ఞవిహారవిభ్ర, మములఁ గొమరారు కమలషండములభాతి
నర్థిఁ జూచుచు హలధరుం డల్లనల్ల, నేఁగి యొక్కెఁడ నొకపొదరింటిలోన.

134

బలరాముఁడు ప్రత్యుత్థానము చేయమి నలిగి సూతుం జంపుట

సీ.

ఉన్నతాసనమున నుండి సూతుం డను పౌరాణికుఁడు సెప్ప బహుపురాణ
కథ లర్థి వినుచున్న కణ్వభరద్వాజకుశికాత్రికుత్సాదిగోత్రజాతు
లగుభూసురుల డాయ నరిగినఁ గనుఁగొని యమ్మహామతు లీతఁ డధికశీధు
పానమదోన్మత్తుఁ డైనవాఁ డని భీతి దిగ్గన లేచి యాతిథ్యపూజ


తే.

లొనరఁ జేసిరి సూతుఁ డయ్యున్నతాస, నమ్ము దిగకున్నఁ జూచి మనమ్ము గ్రోధ
రంజితమ్ముగ నతనిశిరమ్ముఁ జేతి, గుదియఁ బగులంగ నొకవేటు గొనియె సీరి.

135


వ.

ఇట్లు సంకర్షణగదాఘాతంబునం గతప్రాణుం డై పౌరాణికుండు బ్రహ్మపద
ప్రాప్తుండయ్యె నంత.

136