పుట:మార్కండేయపురాణము (మారన).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పడసెద నాతపోబలమున నని పల్కి భీమరయంబున బెరసి యొక్క
జడ వహ్నిలోపలఁ జయ్యన వ్రేల్చిన వికృతఘోరాననవిస్ఫురద్భ


తే.

యంకరోజ్జ్వలమూర్తి వృత్రాసురుండు, పుట్టె నతనికిఁ దైజసస్ఫూర్తిఁ గలుగ
సప్తమునులను బంపి తత్సంధిఁ జేసి, వేల్పుఱేఁ డొక్కవెంట నవ్విప్రుఁ జంపె.

117


వ.

అంత

118


క.

ఆహత్యఁ జేసి యింద్రుని, దేహబలము వోయి వాయుదేవుని గూడె
న్మాహాత్మ్య మడఁగె విప్ర, ద్రోహంబున నెట్టిఁడైన దురితముఁ బొందున్.

119


క.

ఆసమయంబునను నహ, ల్యాసక్తుం డగుట నింద్రుఁ డగ్గౌతముచే
గాసిపడి నైజతేజముఁ, బాసి వికృతి నొంది నష్టబలుఁడై యుండెన్.

120


చ.

తదవసరంబున న్సకలదైత్యులు దానవులు న్మదంబునం
ద్రిదశవిభు న్జయింపఁగ మదిం దలపోసి మఘాదిధర్మసం
పద లణఁగింపఁ బూని బహుపార్థివవంశములందుఁ బుట్టి రు
ర్వి దలరి భూరిభారవహవిహ్వల యై చనియె న్సురాద్రికిన్.

121


మ.

చని యింద్రాదిసుపర్వులం గని మనస్తాపంబు దీపింప ని
ట్లనె నద్దేవి మనుష్యలోకమున నత్యంతోగ్రతేజోఘనుల్
దనుజు ల్పుట్టినవా రనేకనృపులై తత్సేన లక్షోహిణుల్
వినుఁ డే నోర్వఁగఁ జాల మీక తగు నావ్రేఁగంతయు న్బాపఁగాన్.

122

ఇంద్రుఁడే పాండవరూపంబున నైదువిధము లగుట

క.

అని చెప్పిన నయ్యమరులు, విని యందఱు నపుడు ధరణివ్రేఁ గుడుపఁగ న
త్యనుపమనిజతేజోంశము, లొనరం బుట్టించి రుర్వి నుర్వీనాథా!

123


తే.

అమరపతి నిజతేజ మేనంశములుగఁ, జేసి తా భూమరుజ్జలశిఖినభముల
శక్తు లూఁది ధర్మజ భీమ సవ్యసాచి, నకుల సహదేవు లనియెడినామములను.

124


మాలిని.

అసురదమనలీలాయత్తకౌతూహలుం డై
మసలక భువిఁ గుంతీమాద్రులం దుద్భవించెన్
వసుధభరము మాన్ప న్వాసవుం డిట్లు తేజో
విసరపిహితమూర్తు ల్విస్ఫురింప న్మునీంద్రా!

125


క.

పెక్కొడళులు పేరులు ని, ట్లక్కజముగఁ దాల్చి పుట్టినట్టిమహేంద్రుం
డొక్కండ కాక ద్రౌపది, కెక్కడివా రరయ భర్త లేవురు చెపుమా.

126


వ.

అని విహంగవల్లభులు ద్రౌపది యేవురకు నేకవల్లభ యైనతెఱం గెఱింగించి బలదేవు
నికిఁ బాటిల్లిన బ్రహ్మహత్యాప్రాయశ్చిత్తప్రకారంబులు చెప్పెదము విను మని
యిట్లనిరి.

127

బలరామబ్రహ్మహత్యాప్రాయశ్చిత్తప్రకారము

క.

కౌరవపాండవసమర, ప్రారంభం బెఱిఁగి రాముఁ డచ్చోటికిఁ దా