పుట:మార్కండేయపురాణము (మారన).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నెలమిఁ దమచిత్తముల నావహించి హర్ష, మగ్ను లగుచు నందంద నమస్కరించి.

107


వ.

ద్రోణనందను లాజైమినిం జూచి మహాత్మా! నీయడిగినయర్థంబులు మాయెఱిఁగిన
తెఱంగున నెఱింగించెద మాకర్ణింపుము.

108

ధర్మపక్షులు భారతార్థసంశయములఁ జెప్పఁ దొడఁగుట

తే.

ఎవ్వఁ డబ్ధిపర్యంకశాయిత్వలోలుఁ, డెవ్వఁ డఖిలప్రజాసర్గహేతుభూతుఁ
డెవ్వఁ డాదిమసంయమిధ్యేయమూర్తి, యట్టిదేవుండు సకలలోకార్చితుండు.

109


క.

ఆరయ నిర్గుణ సగుణో, దారతల న్నిరవయవుఁడు సావయవుఁడు నై
సారవిభూతి వెలుంగును, నారాయణుఁ డతని కమరు నాలుగుమూర్తుల్.

110


వ.

వాసుదేవసంకర్షణప్రద్యుమ్ననారాయణాభిధానంబులు గలిగి విలసిల్లు నామూర్తుల
విధంబు వివరించెద వినుము.

111

శ్రీ నారాయణవ్యూహ చతుష్టయవివరణము

,

మ.

అరయ న్వర్ణము పేరు రూపమును లే కత్యంతతేజోమయ
స్ఫురణాసంపదఁ జెంది సర్వగతి సంపూర్ణత్వముం బొంది వీ
తరజస్పత్త్వతమోవికారవిమలత్వం బొంది యోగీంద్రభా
సురనిష్ఠాత్మిక యాదిమూర్తి గడుఁ బొల్చు న్వాసుదేవాఖ్య యై.

112


తే.

శేషరూపంబు నొంది యశేషభూభ, రంబు నుద్యత్ఫణాసహస్రమునఁ దాల్చి
సర్పసమితి గొలువఁ దమశ్శక్తిఁ బొలుచు, దివ్యసంకర్షణాఖ్యద్వితీయమూర్తి.

113


క.

ధరణీప్రజానుపాలన, పరిణతి సదవననిరూఢి బహువిధధర్మో
ద్ధరణరతి న్సత్వోన్నతిఁ, బరగుఁ దృతీయ యగుమూర్తి ప్రద్యుమ్నాఖ్యన్.

114


తే.

బహుళజలమధ్యమునఁ బెనుబాఁపపాన్పు, పై రజశ్శక్తి గైకొని పవ్వళించి
లీల నఖిలలోకములు గల్పించు వినయ, ధుర్య నారాయణాఖ్య చతుర్థమూర్తి.

115


వ.

ఈనాలుగుమూర్తులందుఁ బ్రద్యుమ్నమూర్తి యైన దేవుండు పరమసాత్త్వికుండు
సకలధర్మకుళలుండు భక్తజనలోలుండు జగదవనశీలుండు నపారకృపావిశాలుండు
నగుటం జేసి సురగణరంజనంబు నసురగణభంజనంబు నిగమనికరరక్షాఖేలనంబు
ధర్మపరిపాలనంబు నొనరించుచు నొక్కమాటు వరాహనరసింహవామనాదిరూపం
బులు గైకొని ధరణి ధరియించి హిరణ్యాక్షు సంహరించి హిరణ్యకశిపు హరించి
బలి నణంచి జగంబులయలజడి యడంచు మఱియు దేవమనుష్యతిర్యగ్యోనులం
దుపేంద్రరామతిమికమఠరూపంబుల నావిర్భవించి లోకరక్షణోపాయపరాయణుం
డై వర్తించుట గారణంబుగా భూభారసంహారార్థంబు మనుష్యత్వంబు నొందె
నని చెప్పి యప్పక్షివరులు పాంచాలీభర్తలప్రకారంబు వినుమని యిట్లనిరి.

116

పాంచాలీభర్తృపంచకవివరణము

సీ.

శతమఖుచేఁ దనసుతుఁడు మృతుండైన విని విశ్వకర్మయు విపులకోప
వేగుఁ డై లోకము ల్వినఁగ మద్ద్రోహిని దునుమఁగ నోపిన తనయు నిపుడు