పుట:మార్కండేయపురాణము (మారన).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

సురకరి యీ యద్రిఁ జరియించు నేనుంగుఁ గొదమలఁ గ్రీఁబడ్డకొదమ యొక్కొ!
నవకల్పలతిక లీనగముశృంగంబుల యం దొత్తి పాఱినయంబు లొక్కొ!
హరశిరోరత్న మీయచలంబుమణుల పెం బ్రోవులకడపటిపొల్ల యొక్కొ!
పరమేష్ఠియంచ యీగిరికొలంకులయంచపిండులోఁ దప్పినపిల్ల యొక్కొ!


తే.

యని నుతింపుచుఁ జేరి సంయమికుమార, పఠ్యమాననానాగమాభ్యసనచతుర
కీరనికరోల్లసత్సహకారవనవి, రాజితం బైనతత్కందరంబునందు.

97


వ.

పరమజ్ఞాను లైనద్రోణనందనులు తపస్స్వాధ్యాయసంపన్ను లై సుఖం బున్న
వారు వారల నడుగఁ బొ మ్మనిన మార్కండేయు వీడ్కొని జైమిని వింధ్యగిరి
కరిగి యవ్విహంగకుమారు లున్నశిఖరప్రదేశంబు డాయం బోయి తదీయమధు
రాధ్యయనధ్వని విని విస్మితుం డగుచు నంతర్గతంబున.

98

జైమిని ధర్మపరులయొద్ద కేఁగుట

క.

జితనిశ్వాస మవిస్వర, మతివిస్పష్టంబు సౌష్ఠవాన్వితము వివ
ర్జితదోషం బీభవ్యులు, శ్రుతిపఠనం బింత కర్ణసుభగం బగునే?

99


క.

ఈరూపంబున నిమ్ముని, దారకు లుండంగ వీరిఁ దగిలి ప్రియం బే
పారఁగఁ బాయక యున్నది, భారతి యిది చోద్య మెన్నిభంగులఁ దలఁపన్.

100


వ.

అనుచుఁ దత్ప్రదేశంబు ప్రవేశించి విశాలశిలాతలవిష్టరోపవిష్టు లైనయాద్విజో
త్తములం గాంచి హర్షించి స్వవచనపూర్వకంబుగా ని ట్లనియె.

101

జైమిని ధర్మపక్షుల భారతార్థములఁ బ్రశ్నించుట

తే.

వ్యాసశిష్యుండ జైమిని యనఁగఁ బరఁగు, వాఁడ భవదీయదర్శనవాంఛఁ జేసి
యరుగు దెంచితి ననిన హర్షాత్ము లగుచు, నాతనికి మ్రొక్కి యాతిథ్య మాచరించి.

102


తే.

సేమ మడిగి ఱెక్కలగాలి సేద దీర్చి, యనిరి మునికి దార్క్షేయు లత్యాదరమునఁ
బుట్టు బ్రతుకును సఫలతఁ బొందె మాకు, నిపుడు భవదంఘ్రిపద్మాభివీక్షణమున.

103


క.

మాయొడళులలో నుండెడు, నాయతపితృకోపవహ్ని యంతయు నడఁగెన్
శ్రీయుత! భవద్విలోకన, తోయంబులఁ జేసి సకలదుఃఖచ్యుతిగాన్.

104


వ.

అని పలికి ద్రోణనందనులు మునీంద్రా! భవదాగమనకారణం బేమి యెఱింగింపు
మనిన జైమిని యి ట్లనియె.

105


సీ.

అనుపమం బగుభారతాఖ్యానమున సందియములైనయర్థంబు లర్థి మిమ్ము
నడుగ నేతెంచితి ననిన నాద్విజవరు లవి మాకు విషయంబు లై మదీయ
మగుబుద్ధి దోఁచిన యట్లెల్లఁ జెప్పెద మడుగుము నీ వన్న నతిముదమున
నతఁడు మార్కండేయు నడిగినయట్టుల నన్నియర్థంబులు నడుగుటయును


ఆ.

నమ్మహానుభావు లలరి నారాయణు, నాదిపురుషు నిత్యు నప్రమేయు
నఖిలవేదమయుఁ జరాచరగురుఁ బర, మాత్ము వాసుదేవు నజు ననంతు.

106


తే.

విష్ణుఁ బ్రభవిష్ణు నచ్యుతు విగుణు సగుణు, హరిఁ జతుర్వ్యూహు నవ్యయు నభవుఁ బరము