పుట:మార్కండేయపురాణము (మారన).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

కడిఁదిశత్రులైన కామాదు లలజడి, పాలు పఱుప నవశభావ మొంది
మోహసాగరమున మునుఁగుచున్నది లోక, మత్తెఱంగు విను మహానుభావ!

88


వ.

 ప్రవిమలజ్ఞానప్రాకారంబును శల్యకీలకంబును జర్మకుడ్యంబును రక్తమాంసాను
లేపనంబును నానాస్నాయువేష్టనంబును మహామాయాముఖంబును నైనయట్టి
పురంబునకుఁ బురుషుండు రాజు ఆరాజునకు మనోబుద్ధులు పరస్పరవిరోధు లైన
మంత్రులు కామక్రోధలోభమోహంబు లత్యంతబలవంతులైన శత్రువులు
ఈనలువురు శత్రులు చొరకుండ నన్నరపతి దనవీటివాకిళ్లు పదిలంబుగా సంవృ
తంబు చేసికొనియె నేని దాను నిరాతంకుండును సమాధిస్వాస్థ్యబలసంపన్నుండును
బరమానురాగుండునగు నవ్వాకిళ్లుగట్ట నసమర్థుం డయ్యె నేనిం గామమహా
శత్రుఁడు నేత్రాదిపంచద్వారప్రవిష్టుం డై సర్వంబును వ్యాపించు నతని వెనుకన
యమ్మువ్వురుపగతురుం బ్రవేశింతు రన్నలువురుంగూడి యింద్రియంబులతోడను
మనంబుతోడను గాఢాశ్లేషం బొనరించి వాని నన్నింటి నవ్వాకిళ్ళనుం దమవశంబ
కా నొనర్చికొని దురాసదులై యక్కోటయురలం ద్రోచి యయ్యమాత్యులం
గీటడఁగించి యంతయుం దారయై వర్తింతు రంత నమ్మహీకాంతుండు మంత్రిరహి
తుండు విగతపరివారుండు నై నశించు నివ్విధంబునం గామాదిశత్రులు మనుష్య
స్మృతినాశకు లగుటం జేసి యేము మోహాపహృతచిత్తులమై ప్రాణలోభంబున
నెఱుకచెడి బుద్ధి వో విడిచి యపరాధంబుఁ జేసితిమి మాకుఁ బ్రసన్నుండ వై
నీయిచ్చిన శాపంబు గ్రమ్మరించి తామసి యైనకష్టగతిం బొందకుండ మమ్ము రక్షింప
వే యనిన నమ్మహాత్ముం డి ట్లనియె.

89


ఉ.

నావచనం బమోఘ మెడ నవ్వుచుఁ బల్కినఁ దప్ప దెన్నఁడున్
దైవకృతంబు మానుషహతం బగు నెట్లు? తనూజులార! దుః
ఖావహ మైనపక్షిభవ మైనను నిర్మలబోధ మెప్పుడున్
మీ వమలాంతరంగముల నిత్యము గాఁగ ననుగ్రహించితిన్.

90


క.

దురితక్లేశభయమ్ములఁ, బొరయక విజ్ఞానవిదితపుణ్యపథములం
బరగుఁడు సమస్తవిద్యా, పరు లగుఁడు మనుష్యవాక్ప్రభావము మెఱయన్.

91


వ.

అని యి ట్లస్మజ్జనకుడు ప్రసాదించిన నేము పెద్దకాలంబునకు నివ్విధంబున.

92


క.

పక్షుల మై పుట్టి భవ, ద్రక్షణమునఁ జేసి యిట్లు బ్రతికితి మని యా
పక్షులు తమవృత్తాంతం, బక్షిణప్రీతిఁ జెప్పె నమ్మునిపతికిన్.

93


వ.

చెప్పి సంప్రీతచేతస్కుం డైనశమీకునిచేత మధురవాక్పుష్పంబులం బూజితు లై
యాద్విజోత్తము లతని వీడ్కొని చని.

94


తే.

పద్మరాగనభోమణిప్రభలు మెఱయఁ, జంద్రకాంతచంద్రద్యుతిజాల మెసఁగ
బహులతరవజ్రనక్షత్రపంక్తి వెలుఁగ, నంబరస్పర్ధి యైనవింధ్యంబు గనిరి.

95


వ.

కని తదీయరామణీయకంబున కచ్చెరు వంది.

96