పుట:మార్కండేయపురాణము (మారన).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

పరమపూజ్యుఁడు దండ్రియు గురుఁడుఁ గాని, యొరుఁడు గాఁడని తలఁపు మీ కొదవెనేని
బొంకు గాకుండ నాపల్కు పూని సేయుఁ, డనిన మే మట్ల చేసెద మంటి మనుఁడు.

73


క.

ఇండు భవత్తనువులఁ గల, కండలు నెత్తురును వేగ కమియంగా నీ
యండజపతి కానంద మ, ఖండముగా క్షుత్తృషావికారము లడఁగన్.

74


వ.

అనిన మరణభయంబున వడవడ వడంకుచుఁ దల్లడిల్లి యే మి ట్లంటిమి.

75


క.

ఎ ట్టిట్లు పలికి తీ విది? యె ట్టొనరింపంగ వచ్చు నీపని? దేహం

బె ట్టొకనిదేహమునకై, నెట్టన యీవచ్చుఁ? దండ్రి! నిక్కము చెపుమా.

76


తే.

దేవ పితృ ఋషిఋణములు తీర్చి యధిక, భక్తిఁ బరిచర్య సేయుచుఁ బరగి తండ్రి
కరుణ బ్రతికి యుండెడువాఁడు గాని యనఘ, విను శరీరప్రదుండును దనయుఁ డగునె.

77


తే.

ప్రాణములు గల్ల శుభములు పడయవచ్చు, ధర్మములు సేయ నగుఁ గానఁ దన్నుఁ గీడు
చెందకుండంగ నరుఁడు రక్షించుకొనుట, ధర్మమని చెప్పుదురు ధర్మతత్త్వవిదులు.

78


వ.

అది కారణంబుగా మేము నీ చెప్పినయప్పని సేయ మనినం గోపించి తామ్రనయ
నుండై మాతండ్రి మముఁ దిర్యగ్యోనిజాతుల రగుఁ డని శపించి తనసత్యవ్రతంబు
పరిపాలింపం దలంచి యప్పులుఁగుఱేనియాననం బాలోకించి మదీయదేహంబు
నీ కాహారంబుగా సమర్పించితి శుచి వై సేవింపు మనుటయు విస్మితుం డగుచు
నవ్విహంగపురుహూతుం డి ట్లనియె.

79


తే.

యోగబల మూఁడి దేహంబు నుజ్జగింపు, జీవుఁ డొడలిలో నున్న భక్షింప ననిన
నక్షణమ యోగసంయుక్తుఁ డయ్యె ముని త, దీయనిశ్చయ మెఱిఁగి యద్దేవవిభుఁడు.

80


మ.

తనరూపంబు ధరించి యి ట్లను మునీంద్రా! బుద్ధి సంమోద మం
దను బక్ష్యాకృతిఁ బొంది నీహృదయతాత్పర్యం బెఱుంగంగ వ
చ్చిన నాతప్పు సహింపు చేసెద భవచ్చిత్తేప్సితం బెద్ది చె
ప్పు నిను న్సంతతసత్యపాలనమునం బుణ్యుండు గాఁ గాంచితిన్.

81


ఆ.

నేఁడు మొదలు గాఁగ నీకు నైంద్రజ్ఞాన, మావహిల్లు విఘ్న మడఁగిపోవుఁ
దపమునందు విమలధర్మమునందును, నని సురేంద్రుఁ డరిగె నంత నేము.

82


వ.

మాతండ్రి యెదిరికిం జని.

83


మ.

శిరము ల్వ్రాలఁగ మ్రొక్కి నెన్నుదురుల న్జేతు లొగిం జేర్చి దై
న్యరసం బాస్యములందు వెల్లిగొన సర్వాంగంబులుం గంపమున్
బొరయం గుత్తుక లెండ నీరెలుఁగులం బుణ్యాత్మ! మ మ్మీయెడ
న్మరణాపాయభయంబు మన్నిగొనియె న్మాతప్పు సైరింపవే.

84


వ.

అని మఱియు నిట్లంటిమి.

85


ఆ.

చర్మమాంసశల్యసంఘాత మై రక్త, పూరపూర్ణ మైనపొల్లయొడలి
యందుఁ జేయు వేడ్క యనఘ! యకర్తవ్య, మట్టివేడ్క యప్పుడయ్యె మాకు.

86


వ.

ఏ మన నెంతవార మవధరింపుము.

87