పుట:మార్కండేయపురాణము (మారన).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్ఫుల్లదయామతి న్విగతదుఃఖులఁ జేసితి గానఁ బెంపు సం
ధిల్లఁగ మాకుఁ బ్రాణములు దేహములం గలిగె న్మునీశ్వరా!

62


ఉ.

ఎన్నఁడు వృద్ధిఁ బొందు నివి యెన్నఁడు రూపు వహించుఁ బొల్బు నిం
కెన్నఁడు నల్గడం జెలఁగి యేడ్తెఱఁ బాఱుచు నుండు నామెయిం
జెన్నుగ నెన్నఁ డాటమెయిఁ జెందిన ఱెక్కలధూళి నించు నే
నెన్నఁడు చూడఁ గాంతు నొకొ యీ తరుశాఖలఁ గేళి సల్పఁగాన్.

63


తే.

అనుచు నర్మిలియును గరుణాతిశయము, నగ్గలింపఁగ నీవు మ మ్మరసి పెనిచి
తనఘ యేము ప్రబుద్ధుల మైతి మింక, నేమి పనులు చేయుదుము మునీంద్ర! చెపుమ.

64


క.

అని ప్రస్ఫుటవాక్యము లి, ట్లొనరఁగఁ బలుకుటయుఁ వెఱఁగునొంది పులకముల్
తనువున నెసఁగఁ గుతూహల, మునఁ బక్షుల కిట్టు లనియె మునివరుఁ డెలమిన్.

65


క.

ఎవ్వనిశాపంబున మీ, రివ్వికృతిం బొందినార లేది కతము మీ
కివ్వాగ్విభవము కలుగుట, కివ్విధ మంతయునుఁ జెప్పుఁ డేర్పడ మాకున్.

66

ధర్మపరులు శమీకునకుఁ దమవృత్తాంత మెఱిఁగించుట

చ.

అనవుడుఁ బక్షు లిట్టు లను నమ్మునివల్లభుతో నతిప్రియం
బున విపులుండు నాఁ గలఁడు పుణ్యుఁడు సంయమిసత్తముండు ద
త్తనయులు సత్తపోధను లుదాత్తగుణు ల్సుకృశుండు తుంబురుం
డును సుకృశుండు మాపిత గడు న్వినయంబున నేము దండ్రికిన్.

67


వ.

శుశ్రూషణం బొనరించుచుండ నొక్కనాఁడు వృద్ధశ్రవుండు మాతండ్రి సత్య
వ్రతనిష్ఠ యరయం దలంచి వృద్ధవిహంగం బై చనుదెంచి యి ట్లనియె.

68


సీ.

విను మునివల్లభ! వింధ్యశృంగమున నే నుండంగ నడరినచండపవన
హతి భగ్నపక్షుండ నై పడి మూర్ఛిల్లి యెనిమిదిదినముల కిపుడు దెలిసి
యుదరాగ్ని కొని కాల నోర్వంగఁ జాల కతిథి నైతి నాహారతృప్తిఁ జేసి
ప్రాణము ల్గావవే యనవుడు నీ కిష్ట మెయ్యది పెట్టెద నెఱుఁగఁ జెప్పు


ఆ.

మనినఁ బక్షి యడిగె మనుజమాంసము దాని, కాత్మ నతఁడు రోసి యకట క్రూర
హృదయుఁడవు గదయ్య! హింసార్జితాహార, మడుగఁ దగునె నను విహంగనాథ!

69


క.

ఇది రూపం బిది ప్రాయం, బిది నీపడియెడునవస్థ యింకైన శమం
బొదవఁగ వలదే మనమున, నది దుష్టాత్ములకు నేవయస్సునఁ గలుగున్.

70


వ.

నీ వెట్టివాఁడ వై తేమి? నీకుం బ్రతిశ్రుతంబు చేసినయశనం బవశ్యంబును బెట్టెద
నని నిశ్చయించి.

71


మత్తకోకిల.

ఏమి చెప్పుదు మేము నీకు? మునీంద్ర! యప్పుడు తండ్రి మ
మ్మామిషంబుగ నాఖగంబున కామతింపఁ దలంచి తాఁ
బ్రేమవంతుఁడు వోలె క్షుద్రతఁ బిల్చి యెంతయు మాగుణ
స్తోమముం గొనియాడి యి ట్లను దుష్టనిష్ఠురభాషలన్.

72