పుట:మార్కండేయపురాణము (మారన).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

సురలకు నోడి పాఱకుఁడు సొంపఱి రాక్షసులార! పాఱిన
న్మరణము దప్పునే యచట? మానుగ థాత యొనర్చినట్టి వెం
దెరువు మొఱంగ నెవ్వరికిఁ దీరునె? యాఱడి యేల? శౌర్యము
న్జిరతరకీర్తియు న్జెడఁగఁ జేయఁక కయ్యము సేయుఁ డుక్కునన్.

53


తే.

సమర మొనరించినంతనే చావు రాదు, పాఱిపోయినయంతనే బ్రతుకు రాదు
జీవితంబును మరణంబు దైవకల్పి, తములు వానికి ముదమందఁ దలఁక వలదు.

54


ఉ.

కొందఱు తీవ్రశస్త్రహతిఁ గొందఱు దుస్తరరోగబాధలన్
గొందఱు నీరు ద్రావునెడఁ గొందఱు భోజనకార్యవేళలన్
గొందఱు యోగముక్తు లయి కొందఱు నిష్ఠఁ దపం బొనర్చుచున్
గొందఱు కాంతల న్గవయుకోర్కులఁ జత్తు రనేకభంగులన్.

55


వ.

మరణభయంబున కిది నిమిత్తం బని నిరూపింప రాదు.

56


క.

దైవంబు చక్కఁజూచిన, నేవిధమునఁ గీడు పొంద దెయ్యెడ నున్నన్
దైవంబు తప్పఁ జూచిన, నే విధమున మేలు వొంద దెయ్యెడ నున్నన్.

57


వ.

అని భార్గవుండు దెలిపినం తెలిసి యారాక్షసులు మరణభయంబు విడిచి రణపరా
యణు లై రమహాత్ముండు చెప్పిన వాక్యంబులయర్థం బిట్టివిషమసమరస్థలంబునం
బడి బ్రతికినయివ్విహంగంబులచేత నిట్లు సత్యప్రదర్శితం బగునె? యివి సామాన్య
పక్షులుగావు విప్రజాతు లగుట సందేహంబు లేదు సరగున నకులశ్యేనమార్జాల
మూషకాదులవలనిభయంబు లేకుండ నతిప్రయత్నంబున వీని రక్షింపవలయు
నొయ్యన నెత్తికొని రం డని యమ్మునీంద్రుండు శిష్యులం బనిచి నిజాశ్రమంబున
కరిగి వానికి సముచితస్థానంబున సంవిధానం బాచరించి యనుదినంబును బయః
ఫలాదివివిధాహారంబులం బోషణం బొనరించుచుండ మాసమాత్రంబునం
బ్రవర్ధిల్లి యొక్కనాఁడు.

58


మహాస్రగ్ధర.

జవసత్వస్ఫూర్తు లొప్ప న్సకలమునిజనాశ్చర్యసంపాదలీలా
ప్రవణంబై పక్షిజాలప్రవరము లెగసె న్పర్వతంబు ల్చలింపన్
రవిల కాద్యూర్ధ్వలోకప్రతతిఁ గడప సంరంభ మేపారఁగా ని
య్యవనీచక్రంబు సూక్ష్మం బయి తమకు రథాంగాకృతిం దోఁచుచుండన్.

59


ఆ.

అట్టు లెగసి మగుడ నరుదెంచి యమ్ముని, నాథునకుఁ బ్రదక్షిణంబు చేసి
భక్తిఁ బాదములకుఁ బ్రణమిల్లి విహగకు, మారు లిట్టు లనిరి మనము లలర.

60


క.

మరణము దప్పించి మముం, గరుణ మెయిం బెంచి తిట్లు గారామున నీ
వరయఁగఁ ద్రాతవు తండ్రివి, గురుఁడవు మా కేడుగడయు గుణరత్ననిధీ!

61


ఉ.

తల్లి మొగంబు గాన కటు తండ్రికి దవ్వయి గంటలోఁ గడుం
దల్లడ మంది పుర్వులవిధంబున వందురుచున్న మమ్మును