పుట:మార్కండేయపురాణము (మారన).pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విధంబునం బరిపాటిఁ దేటపడ నెఱింగించితి నేతత్పురాణకథ లాకర్ణించితే! భవదీయ
హృదయంబు పరమజ్ఞానదీప్తం బైనయదియే? సమస్తసంశయములు నివృత్తము
లయ్యెనే? యనవుడు నతండు.

280


చ.

అనుపమభార్గవాన్వయసుధాంబుధిచంద్ర! మహామునీంద్ర! స
ర్వనిగమసారబోధజనిరంజితచిత్తపవిత్రపుత్రవం
దన! రతిసంశ్రితార్థిజనతాహరిచందన! శ్రీమృకండునం
దన! సకలంబు నాకు విదితంబు కృతార్థుఁడ నైతి నీకృపన్.

281


ఆ.

అనఘ! నీప్రసాదమున నిమ్మహాపురా, ణార్థజాత మెల్ల నర్థి నాదు
సంశయంబుఁ బాపె సర్వంబు నెఱిఁగితి, వినుతదివ్యబోధఘనుఁడ నైతి.

282


వ.

అని కోష్టుకి ప్రహృష్టహృదయుండై మార్కండేయు బహువిధంబులం బ్రస్తుతించి
నమస్కరించి వీడ్కొని నిజాశ్రమంబున కరిగి పరమానందంబునం దప మాచరించు
చుండే నని పరమజ్ఞానచక్షు లైనపక్షు లాపారాశర్యశిష్యుం డైనజైమినికి మార్కం
డేయపురాణకథావృత్తాంతం బెఱింగించి యిట్లనియె.

283

ఫలశ్రుతి

క.

శ్రీమార్కండేయపురా, ణామృతరససేవఁ జేసి యజరామరు లై
ధీమంతులు గాంతు రొగి, న్భౌమస్వర్గాపవర్గపదసుఖలీలన్.

284


సీ.

అతిభక్తితో నిమ్మహాపురాణము సభాస్థలమున నప్పుడుఁ జదువువారు
వినియెడువారును గొనియాడువారును వ్రాయువారలును దీర్ఘాయురర్థ
బహుపుత్రధనధాన్యమహిమఁ బ్రసిద్ధు లై, పెను పొందుదురు వారి కనుదినంబు
నతులతపఃప్రభావాన్వితుం డైనమార్కండేయసంయమికరుణఁ జేసి


తే.

సర్వతీర్థఫలములును సర్వదాన, ఫలములును సర్వమఘఫలములును గలుగుఁ
బాయు నాపద లెల్ల శుభము లొలయ, ననుపమజ్ఞాన ముదయించు మునివరేణ్య!

285


క.

అని చెప్పిన విని జైమిని, మన మానందమునఁ దేల మధురోక్తుల నిం
పొనరఁగ నాద్విజవరులకు, వినుతి గడు న్జేసి యధికవినయముతోడన్.

286


వ.

ఇట్లు భవదీయవాదేవతాప్రసాదంబున మార్కండేయకథితమహాపురాణజాతార్థం
బంతయు విని కృతార్ధుండ నైతి నని యాపుణ్యపక్షుల దీవించి వీడ్కొని నిజాశ్ర
మంబునకుం జని పరమానందభరితుం డగుచు నుండె.

287

ఆశ్వాసాంతము

చ.

సకలకళాచతుర్ముఖ! యశశ్శ్రితదిఙ్ముఖ! బాహుదండవి
స్ఫురదురుశక్తిషణ్ముఖ! వచోవిలసన్ముఖ! వైరిభీమసం
గరముఖ! నిత్యపోషణవికాసిసుహృన్ముఖ! కాకతిక్షితీ
శ్వరపురపాలనప్రకటశౌర్యవిశేషణ! వంశభూషణా!

288