పుట:మార్కండేయపురాణము (మారన).pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

విషహరంబు లైనవివిధదివ్యౌషధ, ముల భుజంగవరులు మునులఁ బరమ
శాంతిఘనుల నపుడు సంజీవితులఁ జేసి, చనిరి భుజగభువనమునకు నెలమి.

271


చ.

ఘనుఁడు మరుత్తుఁ డప్పు డధికప్రమదంబున వచ్చి తండ్రికి
న్వినయ మెలర్ప మ్రొక్కుటయు వేడుక గ్రక్కునఁ గౌఁగిలించి య
జ్జనపతి పుత్ర! సత్యజయసంపదయు న్బహుపుత్రపౌత్రవ
ర్ధనమును నాయురాప్తియును రాజ్యవిభూతియు నీకుఁ గావుతన్.

272


చ.

అని సుతుఁ బెక్కుదీవనల నవ్విభుఁ డెంతయు గారవించి య
మ్మునులకుఁ దల్లికిం దగఁగ మ్రొక్కి క్రమమ్మున వారి నెల్ల వీ
డ్కొని బహురత్ననూత్నరుచిగుచ్ఛమనోజ్ఞరథమ్ము నెక్కి నం
దనుఁడును దాను నాలును ముదం బెసఁగ న్జని రంత వీటికిన్.

273


వ.

ఇట్లు ప్రవేశంబు సేసి.

274


మహాస్రగ్ధర.

భవనప్రాసాదహర్మ్యోపరితలవిలసద్బాలికాలోచనోద్య
ద్ధవళాంశుశ్రేణితోడ న్దనపయి సితముక్తాసమేతాక్షత ల్ప
ర్వ వరిష్ఠుం డామరుత్తావనిపతి చనియె న్వైభవ ముల్లసిల్ల
న్వివిధాలంకారశోభావిభవవిరచనావిస్ఫురద్రాజవీథిన్.

275


తే.

పురమువిభవంబు సూచుచు భూరితరవి, భూతి నల్లల్లఁ జని రాజపుంగవుండు
నగరు సొచ్చె సమస్తజనంబు చంద్రు, నుదయమునను జలధులట్టు లుబ్బుఁ జెంద.

276


వ.

అంత నిఖలరాజోత్తముం డగుమరుత్తుండు మహిమాయత్తుం డై మహీరాజ్యంబు
సేయుచు విదర్భరాజనందన యైనవైదర్భియు సువీరపుత్రి యైనప్రభావతియును
మాగధతనయ యైనసుకేశియు కేకయసుత యైనకైకేయియు సురంధ్ర మహీపతిత
నయ యైనసౌరంద్రియు సింధునృపతిప్రభవ యైనవపుష్మతియు చేదిపతితనయ యగు
సుశోభనయు ననుకన్యల వివాహం బై వారియందు నరిష్వంతాదు లైనకొడుకులం
బదునెనమండ్రం బడసి సంపత్పరంపరాభివృద్ధి నొంది.

277


సీ.

చెలువొందు నేడుదీవులయందుఁ దనచక్ర మప్రతిహతవృత్తి నతిశయిల్లఁ
గొమరారుమూఁడులోకములందు నెప్పుడు తనరథం బతిరయోద్ధతిఁ జరింపఁ
బొలుచుచతుర్దశభువనంబులందును దనచారుకీర్తి నర్తన మొనర్ప
విలసిల్లుబ్రహ్మాండవివరంబునం దెల్లఁ దనతీవ్రతేజంబు దనరి వెలుఁగ


తే.

లోనిశత్త్రులు వెలిశత్త్రులును నిజప్ర, శాంతివిక్రాంతివిస్ఫూర్తి శాంతిఁ బొంద
లీలఁ జతురంతధాత్రి పాలించుచుండె, సతతకీర్తి మరుత్తాఖ్యచక్రవర్తి.

278


క.

అనఘుం డైనమరుత్తుని, జననము చరితంబు వినినజనులకుఁ గలుగున్
ధనధాన్యపుత్రపౌత్రా, ద్యనుపమవిభవములు నిర్భరానందంబున్.

279


వ.

అని చెప్పి మార్కండేయుండు గ్రోష్టుకికి సూర్యప్రభవంబు లైనరాజవంశంబులు
వంశానుచరితంబులును లౌకికవైదికపారమార్థికంబు లైనయర్థజాతంబులు నీయడిగిన