పుట:మార్కండేయపురాణము (మారన).pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అనిన నయ్యవేక్షితుఁడు భయార్తరక్ష, యేను గావింపఁ బూనితి దాని కీవు
గడఁగి విఘ్నం బొనర్చితి గాన నీకు, బ్రదికి పోవంగ రాదు నాయెదుర నింక.

261


క.

నను నీవొండె శరానల, మున నీఱుగఁ జేసి సర్పములఁ ద్రుంపు వెస
న్నిను నే నొండె శరానల, మున నీఱుగఁ జేసి సర్పములఁ గాతు వెసన్.

262


క.

అతిభీతుఁ డైనశరణా, గతు నార్తుని శత్త్రు నైనఁ గడుకొని కరుణా
న్వితుఁడై రక్షింపనిదు, ర్మతి యగుకుత్సితునిబ్రతుకు బ్రతుకే తలఁపన్?

263


ఆ.

క్షత్రియుండ నాకు శరణాగతాతురో, రగవితాన మది దురాత్మ! తదప
కారకారి నీవు కావున వధ్యుండ, వనినఁ దండ్రి కిట్టు లనియెఁ గొడుకు.

264


క.

తనబాంధవుండు మిత్రుఁడు, జనకుఁడు గురుఁ డనక కడఁగి చంపవలయు భూ
జనపరిరక్షావిఘ్నం, బోనరించిన నీతి యూఁది యుర్వీశునకున్.

265


క.

కావున నిన్ను వధించెద, నీ వలుగకుమీ నరేంద్ర! నృపధర్మం బే
గావించెదఁ గాని యమ, ర్షావేశము లే దొకింత యైనను నాకున్.

266


వ.

అని యిట్లు తండ్రియుం గొడుకును నొండొరులం జంపు తెంపుసొంపునం బ్రచండ
మూర్తు లై యున్న నయ్యిరువురకడకు నతిసంభ్రమంబున నరుదెంచి యౌర్వాది
మునిజనంబులు వారల వారించిన నత్తపోధనుల నాలోకించి మరుత్తుండు మహీ
పతినైననాకు నీదుష్టోరగంబుల దండించుట నిజధర్మంబు గాదే? యిందు నాచేసిన
యపరాధంబు గలదే? యనిన నవేక్షితుం డి ట్లనియె.

267


చ.

శర ణని వచ్చి చొచ్చిరి భుజంగవరు ల్కరుణాత్ములార ! నా
కరయఁగ రక్షితవ్యులు తదార్తులఁ జంపుమదాత్మజుండు ని
ష్ఠురుఁ డపరాధి కాఁడె యనుడు న్మును లూర్జితధర్ము లైనయ
య్యిరువురఁ జూచి మీరు వినుఁడీ భుజగంబులపల్కు లేర్పడన్.

268


సీ.

దుష్టపన్నగవిషనష్టచేతను లైనయిమ్మహామౌనుల నీక్షణంబ
యుజ్జీవితులఁ గాఁగ నొనరింతు మనియెద రిదె తల్లడిల్లి యహీంద్రు లెల్లఁ
గావున నింక విగ్రహము మీ కేటికి వలదు మానుఁడు ప్రసన్ను లరు గండు
సత్యప్రతిజ్ఞులు సద్ధర్మపరులు మీ రిరువురు నిఖిలరాజేంద్రులందు


ఆ.

ననిరి వీర యప్పు డయ్యవేక్షితు డాసి, నీసుతుండు గరము నెమ్మి నాదు
పనుపుఁ జేసి పాపపదుపుఁ గీటడఁప ను, ద్యమము చేఁత సఫల మయ్యె ననఘ!

269


వ.

మృతు లైనమునిపతులు సంజీవితు లగుటం జేసి నీసుతుండును గృతార్థుండు భవ
దీయశరణాగతులు వీతభయజ్వరు లైరి కావున నీవును ధన్యుండవ యని కొడు
కును దీవించి నంత నాభామిని తనయత్తకు నమస్కరించి యురగులరక్షణార్థంబు
పతికిం దననియోగించినతెఱఁ గంతయు నెఱిఁగించి దేవీ! నీప్రసాదంబున నీపుత్త్ర
పౌత్త్రులకు శోభనంబు దొరఁకొనియె నని పలికిన నయ్యిరువురుం దమదివ్యా
స్త్రంబు లుపసంహరించిరి తదనంతరంబ.

270