పుట:మార్కండేయపురాణము (మారన).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ్మునకుం బోయి మహోగ్రకార్ముకరుచిస్ఫూరద్భుజుం దామ్రలో
చను దివ్యాస్త్రసముద్గతానలశిఖాసంవ్యాప్తరోదోంతరున్.

250


తే.

దారుణానలాస్త్రంబు పాతాళమునకు, నుగ్రమూర్తియై చొనుపుచు నున్నవాని
నమ్మరుత్తుని గని డాయ నరిగి యిట్టు, లనియె నల్పస్వరమున వీరాత్మజుండు.

251

పాములకై మరుత్తావేక్షితుల సంవాదము

క.

చనునయ్య యింతకోప, మ్మున బటుసాహసము సేయ భూపోత్తమ! నీ
కనురూపంబే యిది స, య్యన నీ వుపసంహరింపు మస్త్రానలమున్.

252


క.

అనినట్టితండ్రిపలుకులు, విని తప్పక చూచి చేత విల్లుండఁగ న
జ్జనపతి సగౌరవంబుగ, జననికి జనకునకు మ్రొక్కి చండస్ఫూర్తిన్.

253


శా.

ఏమీ యస్త్రము సంహరింపఁ దగునంటే తండ్రి! మద్వీర్యము
న్సామర్థ్యంబు తృణీకరించి యిటు లీసప్తర్షుల న్సభ్యుల
న్సామర్షాతకు లై యకారణమ యీ వ్యాళాధముల్ గ్రూరు లు
ద్దామక్రోధులు చంపి యుండఁగను నీత ప్పేను సైరింతునే?

254


క.

కావున నీబ్రహ్మఘ్నుల, కై వసుధాధీశ! యడ్డ మాడకు మింక
న్నీ వించుక యుడుగను నే, నేవిధమున ననిన నయ్యవేక్షితుఁ డనియెన్.

255


క.

ఈమునివర్యులఁ జంపిన, పాములు నరకంబునందుఁ బడుఁగా కవి నీ
కేమి వెస వస్త్ర ముడుపుము, నామాట ప్రియంబుతో నొనర్పుము పుత్రా!

256


ఆ.

అనిన నమ్మరుత్తుఁ డతిపాపు లగువీరి, నిగ్రహింప కున్న నిరయమునకు
నేను బోదుఁ గాక యీపాము లేఁగునే, దండ ముడుగు మనుట దగునె తండ్రి!

257


వ.

అని మఱియు నత్యంతాపరాధు లైనయీదుష్టోరగములకు నే నుపశమింప మదీయ
ధర్మంబు విడిచి నీపంపును నే నొనరింప ననినం గరంధమనందనుండు కటకటంబడి
కొడుకున కి ట్లనియె.

258


చ.

వల దని యెంత చెప్పినను వారక మచ్ఛరణాగతాహుల
న్బొలియఁగఁ జేయఁ జూచె దది పొర్లగఁ జేసెద వస్త్రవేది వీ
విల నరయంగఁ నొక్కరుఁడవే! వివిధాస్త్రము లే నెఱుంగనే?
నిలుచునె నీదురాగ్రహము నేర్పును నాయెదుర న్దురాత్మకా!

259


సీ.

అని కడుఁ గోపించి యయ్యవేక్షితుఁడు దామ్రాక్షుఁ డై యుగ్రశరాసనమునఁ
బటుతరానలశిఖాభయదకాలాస్త్రంబు సంధించుటయు నిల సంచలించె
నయ్యస్త్రఘోరత్వ మమ్మరుత్తుఁడు సూచి యిట్లనుఁ దండ్రితో నేను దుష్ట
దమనార్థ మిమ్మహాస్త్రము ప్రయోగించితిఁ గాని నీపై నేయఁ గడఁగ నీవు


ఆ.

ధర్మపద మొకింత దప్పనినామీఁద, నీశరంబు దొడుగ నేల చెపుమ?
ప్రజలఁ బాడితోడఁ బరిపాలనము సేయు, నన్నుఁ జంపఁ గారణంబు గలదె?

260