పుట:మార్కండేయపురాణము (మారన).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వాసవుం డంత వారలవాదు మాన్చి, యిమ్మునీంద్రుండు మీలోన నేలతాంగి
నధికగుణవతిగాఁ జెప్పు నదియె యెక్కు, డనిన నారదముని యిట్టు లనియె నపుడు.

18


తే.

మంచుమలమీఁదఁ దపము గావించుచున్న, యనఘ దుర్వాసుమునిపుంగవునిఁ గలంపఁ
జాలు నేయింతి దనవిలాసప్రశస్తి, నదియె పో యెక్కుడనిన భయంబు గదిరి.

19


క.

ఆనతముఖులై యొకపలు, కైనను బలుకంగ నోడి యందఱు నున్నం
దా నిట్లను వపువను నొక, మానిని మునివంకఁ గాంచి మదవతి యగుటన్.

20


చ.

పలుకులు వేయు నేల మునిపాలక! నాదగురూపమంజువా
గ్విలసనలీల నమ్మునివివేక మడంచెదఁ దాల్మిఁ జించెదన్
గలఁచెద డెందముం దపము గర్వము మాన్పెద నే మనంబునం
దలఁచిన రుద్రు నైన ఘటదాసునిఁ జేయుదుఁ గామునింటికిన్.

21

తపముఁ జెఱుపవచ్చిన వపువనునచ్చరను దుర్వాసుఁడు పక్షి వగుమని శపించుట.

మ.

అని గర్వోక్తులు వేడ్కఁ బల్కి వెస నయ్యబ్జాక్షి దృగ్దీధితుల్
దనుకంగాఁ జని కాంచె నంత హిమవంతంబు లసన్నూత్నర
త్ననితాంతద్యుతిపుంజరంజితదిగంతంబున్ లతాంతోల్లస
ద్ఘనరేఖాంచితసానుమంతము మరుద్దంతిస్ఫురత్ప్రాంతమున్.

22


వ.

కని తదీయసుందరకందరంబునందు.

23


క.

మలయానిలమృదులీలా, చలితతరులతాప్రసూనసౌరభమాలా
కలితమధుమత్తమధుకర, విలసనమున నొప్పువనము వెలఁదుక సొచ్చెన్.

24


క.

చొచ్చి మునీశ్వరుఁ డున్నెడ, యచ్చోటికిఁ గ్రోశమాత్ర మగుట యెఱిఁగి చం
చచ్చూతలతాంతరమున, విచ్చలవిడిఁ జంద్రకాంతవేదికమీఁదన్.

25


తే.

ఎలమిఁ గూర్చుండి యెలుఁగెత్తి యింపు మిగుల, వట్టిమ్రాఁకులు చివుళులు వెట్ట నతివ
పాడెఁ బాడిన విని యాతపసి కలంగి, వెఱఁగుపడి యంతయును మది నెఱిఁగి కనలి.

26


వ.

రయంబున వచ్చి రూపగుణగర్వోన్మత్తచిత్త యైనయత్తలోదరిం జూచి.

27


శా.

దుర్వాసుం డతికోపనిస్ఫురితవక్త్రుం డై యనున్ దానితో
గర్వాంధ్యంబున మత్తపంబునకు విఘ్నం బాచరింపంగ నా
గీర్వాణాధిపుతోడఁ బూనితి కడుం గీ డేల లేకుండు? నీ
గర్వం బంతయు నుజ్జగించి విహగాకారంబునం బుంశ్చలీ!

28


తే.

విహగరాడ్వంశమందు నావిర్భవించి, ధరణితలమున షోడశాబ్దములు నిలిచి
సుతుల నలువురఁ గని తుది సునిశితాస్త్ర, హతి శరీరము విడిచి పొ మ్మమరపురికి.

29


క.

నావచన మమోఘం బని, దేవతరంగిణికి నతఁడు దిగ్గనఁ జనియె
న్నావుడు జైమిని యిట్లను, నావనితజనిప్రకార మానతియీవే.

30

వపు వనునచ్చరచరిత్రము

వ.

అనిన మార్కండేయుం డంతయుం జెప్పెద నాకర్ణింపు మరిష్టనేమిపుత్రుండైన