పుట:మార్కండేయపురాణము (మారన).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఒనర బహువిశేషంబుల నుల్లసిల్లు, నట్టిభారతాఖ్యానంబునందు గూఢ
తరము లైనసమంచితార్థంబు లెఱుఁగఁ, దలఁచి వచ్చితి నీకడ కలఘుచరిత!

8

జైమిని మార్కండేయమునిని గొన్నిప్రశ్నముల నడుగుట

వ.

నిఖిలభువనోత్పత్తిస్థితిలయకారణుండును ద్రిగుణరహితుండును సర్వవ్యాపకుం
డును నైనపురుషోత్తముం డేమి నిమి త్తంబున మనుష్యత్వంబు నొందెఁ? బరమ
పుణ్యులైన పాండవు లేవురకు ద్రౌపది యొక్కతె యెట్లగ్రమహిషి యయ్యె? మహా
బలుండైన బలభద్రునకుఁ దీర్థంబున కరుగునవసరంబున బ్రహ్మహత్య యెట్లు వాటిల్లె?
దాని కతండు ప్రాయశ్చిత్తం బెత్తెఱంగునఁ జేసెఁ? బాండవేయనందను లైన ద్రౌప
దేయులు కృతచారపరిగ్రహులు గాక యనాథులుం బోలె నేల మృతిఁ బొంది?
రింతయు సవిస్తరంబుగా నెఱిఁగింప నీవ యర్హుండ వనిన నమ్మహాముని జైమిని
కి ట్లనియె.

9


క.

అమరఁగ నీయడిగినయ, ర్థములను జెప్పంగఁ బెద్దతడ వయ్యెడు సం
యమివర్య! నియమవిధులకు, సమయం బరుదెంచె మాకుఁ జనఁగా వలయున్.

10


వ.

నీకు నీయర్థంబు లవశ్యంబు నెఱుంగవలయు నేని.

11


క.

అండజపతులు దృఢాగమ, పాండిత్యులు ద్రోణసుతులు భవ్యులు పింగా
క్షుండును విరాటుఁడును వృ, త్రుండును సుముఖుండు ననఁ జతుర్ముఖసదృశుల్.

12


తే.

ప్రవిమలజ్ఞానవంతులు పరమశాంతు, లఖిలభాషావిశారదు లధికమతులు
సకలశాస్త్రపురాణనిశ్చయసమర్థు, లమితతేజులు సతతసమాధిరతులు.

13


క.

ఉన్నారు వింధ్యనగమున, నన్నలువురు నడిగినట్టియర్ధంబును వి
ద్విన్నుతగుణ! యెఱిఁగింతురు, క్రన్నన చనుమన్న నతఁడు గడువిస్మితుఁ డై.

14


తే.

ఇట్టినిర్మలవాక్సిద్ధి యిట్టియెఱుక, యిట్టిమహిమ యాపులుఁగుల కెట్టు గలిగె?
ద్రోణుఁ డన నెవ్వఁ డట్టిపుత్రుల మహాత్ముఁ, డెట్టు వడసె నతఁడు? చెప్పు మేర్పడంగ.

15

మార్కండేయుఁడు జైమినికి ద్రోణచరిత్రము చెప్పుట

సీ.

అనిన మార్కండేయుఁ డను విను చెప్పెద ననిమిషవల్లభుఁ డప్సరోంగ
నలు గీతనృత్యము ల్సలుపంగ నిజనందనంబున నున్నెడ నారదుండు
వచ్చిన నతనికిఁ జెచ్చెర నాసనాద్యుపచారములు ప్రియం బొనరఁ జేసి
యిదె రంభ మేనక యిదె యూర్వశి ఘృతాచి యిదె తిలోత్తమ నీకు నీలతాంగు


తే.

లందు మె చ్చొనరించు నేయతివనృత్త?, మనిన నీయచ్చరలలోన హావభావ
విలసనోత్కృష్ట నని మది విఱ్ఱవీఁగు, నేవెలఁది దానినృత్యంబ యింపు మాకు.

16


క.

అని ముని పల్కిన నయ్యం, గనలకు నిజరూపవిభవకాంతిచతురతా
ద్యనుపమగుణములఁ దమలో, ననఘా! యే నేన యెక్కు డనువా దయ్యెన్.

17