పుట:మార్కండేయపురాణము (మారన).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

మార్కండేయపురాణము

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

వ.

పరమకళ్యాణపరంపరాభివృద్ధిగా నారచియింపం బూనినయిమ్మహాపురాణంబునకుఁ
గథాక్రమం బెట్టిదనినఁ బల్లవితకుసుమితఫలితవివిధవల్లీవెల్లితమాకందచందనమందా
రాదినానామహీజరాజవిరాజితంబును, దరులతాశిఖరవిహరత్కలకంఠశుకకులకల
కలస్వనమనోహరంబును, ననవరతహోమధూమశ్యామలితవ్యోమమండలంబును,
ననవచ్ఛిన్నాధ్యయనరవబధిరితదిగంతరాళంబును, ననుదినప్రవర్ధమానమహాధ్వరో
త్సవసమాగతశతమఖప్రముఖనిఖిలనిలింపనివహాలంకృతంబును, సమిత్కుసుమ
కందమూలఫలాహరణాగమనార్థపరస్పరాహ్వానమునికుమారకోలాహలవిలసితం
బును, శాస్త్రపురాణేతిహాసకథాకథనచతురతాపసోత్తమపరిషదభిరామంబును,
బరమపావనంబును నైన తపోవనంబునందు.

1


క.

నిరుపమనిష్ఠాపరుఁ డై, పరమతప మొనర్చుచున్న భార్గవవంశో
త్తరు నిర్మలచారిత్రు న,మరపూజ్యుఁ గృపావిధేయు మార్కండేయున్.

2


క.

కానఁ జనుదెంచి సత్యవ, తీనందనశిష్యుఁ డధికతేజోనిధి వి
ద్యానిపుణుఁడు జైమిని వినయానతుఁ డై యిట్టులనియె నధికప్రీతిన్.

3

భారతప్రశంస

చ.

వినుము మునీంద్ర! వేదనిధి విష్ణునిభుండు పరాశరాత్మజుం
డనఘయశుండు సర్వనిగమార్థయుతంబును సర్వధర్మసా
ధనమును సర్వశాస్త్రకలితంబును సర్వకథాభిశోభితం
బును నగుభారతంబు కృతపుణ్యుఁ డొనర్పె సవిస్తరంబుగన్.

4


తే.

మానుగా నింద్రియంబులలోన మనసు, సురలలోన ముకుందుండు నరులలోన
బ్రాహ్మణుఁడుఁ బోలె నెక్కుఁడై భారతంబు, వెలయు సకలదివ్యపురాణవితతిలోన.

5


క.

జలపూరము పాండవకథ, జలరుహనివహములు విదితసరసాఖ్యానం
బులు మృదుపదములు హంసం, బులు మేదిని భారతాఖ్యఁ బొలుచు కొలనికిన్.

6


తే.

వ్యాసవాగ్జలపూర్ణయు నాగమప్ల, వావతీర్ణయు బహుకుతర్కావనీజ
హరిణియు నైనభారతోదారతటిని, యడరి దురితరజోరాశి నడఁచుచుండు.

7