పుట:మార్కండేయపురాణము (మారన).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

వినుము కుమార! యెంతయును వృద్ధుఁడ నైతి నరణ్యభూమికి
న్జనియెద నేఁ గృతార్థుఁడన సర్వమునందును నీకుఁ బట్టబం
ధన మొనరించునీకొఱఁత దక్కను నొండుగొఱంత లేదు నా
కనుపమ మైనరాజ్యముఁ బ్రియంబునఁ గైకొను మీవు నావుడున్.

214


ఉ.

ఆనతవక్త్రుఁ డై యనియె నాతఁడు రాజ్యము సేయ నొల్ల దం
డ్రీ! నెఱ నాడియున్నయది యీధర కన్యు నొనర్పు రాజుగా
హీనత నొంది నీకతన నేఁ జెఱఁ బాసినయప్డ పౌరుష
శ్రీ ననుఁ బాసెఁ బౌరుషగరిష్ఠుఁడు గాక ధరిత్రి యేలునే?

215


క.

ఏపురుషునియాపద లెడఁ, బాపంబడు నొరులచేతఁ బరికింపంగా
నాపురుషుఁడు దా స్త్రీధ, ర్మోపేతుఁడు నిష్ప్రభావుఁ డుర్వీనాథా!

216


వ.

కావున నీచేత మోక్షితుండ నై స్త్రీసమానధర్ముండ నైన నేను మహీభర్త నగుదునే?
స్త్రీకి శూరుం డగుపురుషుండు గదా భర్త యగు ననినఁ దండ్రి యిట్లనియె.

217


తే.

కొడుకునకుఁ దండ్రి తండ్రికిఁ గొడుకు వేఱు, గామి యది పరమార్థంబు గానఁ దండ్రి
నైననాచేత మోక్షితుఁ డైతి గాక, యొరునిచే ముక్తుఁ డైతివే యురుగుణాఢ్య?

218


క.

అనినం దండ్రికి సుతుఁ డి, ట్లను నీచెప్పినది నిక్క మగు నైనను నా
మన సొడఁబడ దే నీచే, విని మోక్షితుఁ డగుట నాకు వ్రీడన సేయున్.

219


తే.

ఒనరఁ దండ్రిచే లక్ష్మిఁ గైకొనునతండు, తండ్రిచేఁ గ్లేశములఁ బాసి తనరునతఁడు
తండ్రిచేతన వెలయు నతఁడు మదీయ, కులమునందును లేకుండవలయుఁ దండ్రి!

220


వ.

అని పెక్కుభంగులఁ జెప్పిన కొడుకు నొడఁబఱుపనేరక మరుత్తునిం బిలిచి నీవు
మహీరాజ్యంబు పూను మనిన నతండు తండ్రిపంపున నొడంబడియె నంత నామను
జేంద్రుండు మనుమనికిం బట్టంబు గట్టి భార్యాసమన్వితుండై వనంబునకుం జని
వేయివత్సరంబులు ఘోరతపంబుఁ జేసి శరీరంబు విడిచి సురలోకప్రాప్తుం డయ్యెఁ
దదీయపత్ని వీరమహాదేవి మఱియు శతవర్షంబులు ఫలమూలకృతాహారయై పతి
సాలోక్యంబు గోరి భార్గవుం డైనయార్వునాశ్రమంబున మునిశుశ్రూష
సేయుచుం దపోవృత్తినుండే నని చెప్పిన విని కోష్టుకి మార్కండేయున
కిట్లనియె.

221

మరుత్తచక్రవర్తిచరిత్ర

చ.

అనుపమధర్మమూర్తియు నయాదరవర్తియుఁ జగ్రవర్తియు
న్ఘనభుజవీర్యుఁడు న్రిపువినాశకరోద్భటశౌర్యుఁడు న్జగ
జ్జననుతకీర్తిధుర్యుఁడును శాంతుఁడు దాంతుఁడు నై నయమ్మరు
త్తునిచరితం బొగి న్వినఁ గుతూహల మయ్యెడు నాకుఁ జెప్పవే.

222