పుట:మార్కండేయపురాణము (మారన).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వీర్యపరాక్రమంబులం బరచక్రపతుల నాక్రమించి సప్తద్వీపాలంకృతం బగుమహీ
చక్రంబు దాన యేలి చక్రవర్తి యగు నీమహనీయమూర్తి యజ్ఞకర్త లైనమహీ
భర్తలలో నగ్రేసరుం డై వర్తిల్లు నని చెప్పినవచనంబు లాకర్ణించి నాకౌకసులు
గంధర్వులు నవేక్షితుండును భామినియుం బరమానందంబు నొంది యావాక్యం
బులు బహువిధంబులం బ్రస్తుతించి రంత.

203

పుత్త్రాదులతో నవేక్షితుఁడు నిజనగరమున కేఁగి తండ్రిం దనుపుట

సీ.

ఆనృపాత్మజుఁడు నిజాత్మజుఁ గొని తాను వనితయు గంధర్వపతులు గొలువ
తనపురంబున కేఁగి మనుజేంద్రపరివృతుండైనతండ్రికి వినయమున మ్రొక్కి
యధిప! నీతోఁ బల్కినట్టులు చేసితి నిదె చూడు పౌత్రునివదన మర్థి
నని సుతు నుత్సంగమున నిడి పడసిన వృత్తాంత మంతయు విన్నవించు


ఆ.

టయుఁ గరంధముండు నయనంబు లుత్కటా, నందవారిబిందుసుందరములు
గా ననూనభాగ్యకలితుండ నైతి నే, నంచు బాలుఁ గౌఁగిలించె వేడ్క.

204


తే.

అతఁడు మనుమని మఱియు నందంద ప్రీతి, యడర నాలింగనము చేసి యర్ఘ్యపాద్య
గంధపుష్పాదిపూజలఁ గరము నెమ్మి, నఖిలగంధర్వులకుఁ బ్రియ మాచరించె.

205


ఉ.

పౌరులు మానవేంద్రునకుఁ బౌత్రుఁడు గల్మికి మిన్ను మోసి సొం
పారఁగఁ జేసి రుత్సవము లఫ్డు పురం బభిరామ మయ్యె శృం
గారఁము లొప్పఁ జేసి పురకాంతలు మంగళగీతవాద్యము
ల్బోరున మ్రోయ నృత్యము లపూర్వముగా నొనరించి రెంతయున్.

206


క.

భూసురుల రత్నకాంచన, వాసోలంకారధేనువసుధాదాన
శ్రీసొంపున సంపన్నుల, జేనెఁ గరంధముఁడు ప్రీతచిత్తుం డగుచున్.

207


వ.

అంత.

208


మ.

సితపక్షంబున నాఁడునాఁటికిఁ గడుం జెన్నొందుశీతాంశున
ట్లతిలావణ్యవిలాసభాసురతనుం డై తల్లికిం దండ్రికి
న్సతతాహ్లాద మొనర్చుచుం బెరిఁగి యాచార్యోపదేశంబునం
జతురుం డయ్యె మరుత్తుఁ డాగమముల న్శాస్త్రమ్ముల న్విద్యలన్.

209


తే.

అభిమతముగ ధనుర్వేద మధిగమించి, ప్రీతి దివ్యాస్త్రచయము పరిగ్రహించె
నఖిలశస్త్రవిద్యలు వేడ్క నభ్యసించెఁ, గ్రమముతో మరుత్తుండు భార్గవునివలన.

210


వ.

అంత.

211


క.

తనకూఁతుతెఱఁగు దౌహి, త్రునిజననము నతని శౌర్యదోర్వీర్యములు
న్విని నిర్భరహర్షరస, మ్మునఁ దేలె విశాలరాజపుంగవుఁడు మదిన్.

212

కరంధముఁడు మరుత్తునకుఁ బట్టాభిషేక మొనర్చి యడవి కేఁగుట

వ.

అంతఁ గరంధముం డరణ్యంబున కరుగం దలంచి యొక్కనాఁ డవేక్షితుం బిలిచి
యిట్లనియె.

213