పుట:మార్కండేయపురాణము (మారన).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యది యట్టివైశాలినిం బరిగ్రహింపక యిపు డీయన్యనారీపరిగ్రహం బెట్లు సేయుదు
ననిన నద్దేవత లిట్లనిరి.

173


క.

ఇదియ కదా నీ చెప్పిన, యది నీసద్భార్య నీకు నై చేసెఁ దపం
బొదువఁగ నీకును దీనికి, నుదయించును సుతుఁడు సత్త్వయుతుఁడు గుమారా!

174

వైశాలిని యవేక్షితునకు నిజవృత్తాంతముఁ జెప్పుట

వ.

అని చెప్పి బృందారకు లరిగినం గరంధమనందనుం డాసుందరిం జూచి నీవిధం
బంతయు నిది యేమి? నా కెఱింగింపు మనిన నది యిట్లనియె.

175


ఉ.

నన్నుఁ బరిత్యజించి నృపనందన! నీ వటు చన్న నంత నే
ను న్నిఖిలాప్తబంధువులను న్బెడఁబాసి యరణ్యభూమికిం
గ్రన్నన వచ్చి మేను దొఱఁగం దెగి తీవ్రతపస్సమాధిమై
నున్ని సుధాశను ల్వనుప నొక్కచరుం డరుదెంచి ప్రీతితోన్.

176


ఆ.

ఇట్లు తగునే యింతి! యీ యేడుదీవులు, నేలుచక్రవర్తి యీడ్యకీర్తి
పుణ్యమూర్తి సుతుఁడు పుట్టు నీ కిది దేవ, వాక్య మొడలు విడువవలవ దనిన.

177


క.

అనిమిషులదూతపలుకులు, విని సంతస మంది తపము విడిచితి నంత
న్నినుఁ బొందఁగఁ గాంతును నేనని మనమున నూఱడిల్లి యంగజమూర్తీ!

178

వైశాలిని నాగలోకవృత్తాంతము చెప్పుట

వ.

అంత నపరదినంబున నేను గంగకుఁ జని యొక్కమడువున నీ రాడుచున్నంత నొక్క
వృద్ధనాగేంద్రుండు రసాతలంబునకు నన్నుఁ దిగిచికొని పోయిన నందలినాగపతులు
నాగాంగనలు నాగకుమారులు సహస్రసంఖ్యులు నాకడకు నరుగు దెంచి బహువిధం
బులఁ బ్రశంసించి పూజించి సవినయంబుగా నిట్లనిరి.

179


క.

నీ పుత్రున కపరాధం, బీ పవనాశను లొనర్తు రిందఱఁ గ్రుద్ధుం
డై పొరిగొనకుండఁగ నీ, వాపురుషవరేణ్యు మాన్పవమ్మ కడుఁగృపన్.

180


మ.

అని ప్రార్థించిన నట్ల చేసేదఁ బ్రియం బారంగ మీ కంటి న
న్న నహీంద్రు ల్బహురత్నభూషణముల న్వస్త్రంబుల న్సాంద్రచం
దనమాల్యంబుల వేడ్క నన్నుఁ జెలు వొంది న్బ్రీతిఁ గైసేసి యం
త నిజావాసము వెల్వరించిన నరేంద్రా! వచ్చి నే నిచ్చటన్.

181


చ.

అనుపమరూపకాంతిమహిమాతిశయంబునఁ నొంటియట్ల నా
తనులత యొప్ప భూషణవితానరుచిం జెలువారుచున్న నీ
దనుజుఁడు చూచి చాఁ దలఁచి దర్పితుఁ డై ననుఁ బట్టుకొన్నఁ గా
చినభవదీయబాహుబలజృంభణ మేఁ బొగడంగ నేర్తునే?

182


క.

నాకుఁ బ్రసన్నుడ వగుము గు, ణాకర! వరియింపు నన్ను నతులభుజబల
శ్రీకరకమనీయత నిల, నీ కెన నృవసుతుఁడు లేఁడు నిక్కం బరయన్.

183