పుట:మార్కండేయపురాణము (మారన).pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్జన నిజ మీపలు కనవుడుఁ, దనయునకుఁ గరంధముండు దా ని ట్లనియెన్.

132


క.

ఈనృపతికి సంతోషము, గా నీధవళాయతాక్షిఁ దగ నబ్జసప
త్నాననఁ బ్రేమార్ద్రీకృత, మానస వరియింతు గాక మనసిజమూర్తీ!

133


తే.

అనిన నాతండు దేవ! నీయాజ్ఞ కే నొ, నర్ప నింతకు ముంద రెన్నఁడు నవజ్ఞ
యిప్పు డేదైన నానతి యిమ్ము సేయఁ, దగనిపని నన్నుఁ బనుపకు ధర్మవేది!

134


వ.

అనిన నక్కుమారునివచనంబులు విని విశాలుండు వైశాలిని నాలోకించి తల్లీ! నీ
వింక నీతనితగులంబు విడువు మనేకరాజకుమారు లున్నవా రందు నీ కభిమతుఁ
డైనవాని వరియింపు మనిన నక్కుమారికారత్నంబు.

135


తే.

నిన్ను వేఁడెద వర మిమ్ము నెమ్మి నాకు, నన్ను నితఁ డిప్పు డొల్లకయున్న మీఁది
భవమునం దిక్కుమారుఁడె వరుఁడు గాఁగ, దారుణాటవిఁ జేయుదుఁ దండ్రి! తపము.

136


తే.

అనియె నంతఁ గరంధముం డావిశాలు, తోడినెయ్యంబు మనమునఁ దొంగలింప
నప్పురంబున దివసత్రయంబు నిలిచి, వేడ్కఁ గొడుకుఁ దోడ్కొని తనవీటి కరిగె.

137

వైశాలిని యరణ్యమునఁ దపము సేయుట

వ.

స్వయంవరోత్సవదర్శనాగతు లైనరాజకుమారులు తమతమపురములకుం జని రంత
వైశాలినీకన్యక సకలబాంధవులం బరిత్యజించి యరణ్యంబున కరిగి పరమవైరాగ్యా
యత్తయు నిరాహారయు నై దారుణం బగుతపం బొనరించుచుండ మాసత్రయం
బతిక్రమించిన.

138


క.

అతులనిరాహారతపో, వ్రతదారుణనియతి నొడలు వట్టి నరము లు
న్నత మై తోఁపగ మరణే, ప్సితమతి నయ్యబల దొట్టి పెద్దయు నార్తిన్.

139

దేవదూత వైశాలిని మరణోద్యమమును నివారించుట

తే.

తనువు దొఱఁగంగఁ దలఁచినఁ దరుణి తెగువ, సుర లెఱింగి చయ్యన నొకచరునిఁ బనిచి
రతఁడు చని యంతరిక్షంబునందు నిలిచి, యాకృశోదరిఁ గాంచి యి ట్లనియెఁ బ్రీతి.

140


ఆ.

దేవదూత నేను దేవత ల్ప్రార్థించి, యర్థి నీకుఁ జెప్పు మన్న కార్య
మబల! వినుము దేహ మతిదుర్లభము దీని, విడువఁ దగవు గాదు వితతపుణ్య!

141


వ.

సప్తద్వీపశోభితావనీచక్రసంవహనసమర్థుం డగుచక్రవర్తికిం దల్లివవు దమ్మహాత్ముండు
నిజభుజవిక్రమంబున న్దివిజరిపుభంజనం బొనరించుచు దస్యుప్రముఖదుష్టజనని
గ్రహం బాచరించుచుఁ దమతమధర్మంబులు తప్పక వర్తిల్లునట్లుగా మహీజనములం
బాలించుచు శతసహస్రసంఖ్యము లశ్వమేధాదిమహాధ్వరములు సేయు ననిన
నయ్యింతి యల్లన ని ట్లనియె.

142


క.

త్రిదివముననుండి వచ్చిన, త్రిదశచరుఁడ వగుదు వీవు తెల్లము సుగుణా
స్పదమూర్తిని సంతానా, భ్యుదయము నా కెట్లు గలుగు పురుషుఁడు లేమిన్.

143