పుట:మార్కండేయపురాణము (మారన).pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చనియె నంత నక్కడఁ గరంధముండు ధర్మపత్నీసహితుండై యనేకవీరావనీశ్వరులు.
గొలువం బేరోలగంబున నుండి నిజనందనుం డధర్మయుద్ధపరు లైనపరులచేతఁ
బట్టువడి బద్ధుండగుట విని పెద్దయుం బ్రొద్దు చింతించుచున్నసమయంబున దీని
కెంతయుఁ జింతింప నేల యనువారును బెక్కం డ్రొక్కని నిట్లు చేసినయాపాపా
త్ముల నిపుడ పొరిగొనవలయు ననువారును రయంబునం జతురంగంబుల సన్నద్ధంబు
గావింప నియోగింపుఁ డనువారును నింతకు మూలం బైనవిశాలుం దెగటార్పక
కోపంబు దీఱదనువారును మనకుమారుండు తగవు దప్పి స్వయంవరంబున బల
దర్పితుం డై కన్నియం బలిమిం బట్టుకొని యాగడంబుఁ జేసిన వార లేల సహింతు
రనువారును గా మఱియు ననేకు లనేకప్రకారంబులం బల్కుపల్కు లాకర్ణించి
వీరవంశప్రసూతయు వీరపత్నియు వీరమాతయు నగువీరమహాదేవి హర్షించి
పతి నాలోకించి సకలభూపతులు విన నిట్లనియె.

111

కరంధముఁడు భార్యాప్రేరితుఁడై యవేక్షితు విడిపించుట

క.

నానారాజకుమారుల, మానధనుల నోర్చి మత్కుమారుఁడు కన్యం
దాను బలిమి న్వరించిన, యానిరుపమశక్తి యెంత యతిశయ మగునో!

112


ఆ.

అవనిపతులు బలియు రందఱు నొక్కొనిఁ, దన్ను బొదివికొనినఁ దలఁక కడరి
పోటు లాడి నాదుపుత్రుండు వడుట దాఁ, గీర్తికరము గాని కీడు గాదు.

113


క.

మది నీతి గణింపక యు, స్మదచేతోరౌద్రరససమగ్రతఁ గడుబె
ట్టిదుఁ డై సింహముక్రియ రిపు, విదళనముం జేఁత సువ్వె వీరగుణ మిలన్.

114


ఉ.

భూతలనాథనందనులు భూరిబలాఢ్యులు సూచుచుండఁగా
నాతనయుండు విక్రమగుణస్ఫురణోజ్జ్వలుఁ డై స్వయంవరో
పేతనరేంద్రకన్యకల నెంతయు బల్మిఁ బరిగ్రహించు టె
గ్గే? తగ వేది వేఁడుకొనునే నృపసూతి జఘన్యుచాడ్పునన్.

115


చ.

వినుఁడు నరేంద్రులార! పటువిక్రముఁ డైనకుమారుబంధనం
బున కయి వంత నొందకుఁడు భూరిభవద్భుజదండవిస్ఫుర
త్సునిశితహేతిఘాతములఁ జూర్ణము సేయుఁడు వీరవిద్విష
జ్జననరనూత్నరత్నవిలసన్మకుటోజ్జ్వలమస్తకస్థలుల్.

116


క.

కరితురగరథపదాతులఁ, బరవసముగ నిపుడ పన్నఁ బంపుఁ డెడఁదఁ బ
ల్వురతోడివిగ్రహం బతి, భర మని తలఁపకుఁడు వినుఁడు పార్థివు లెల్లన్.

117


తే.

అల్పు లగుమేదినీశ్వరులం దొనర్సు, నల్పవిక్రమమున శూరుఁ డైనవాని
కెవ్వనికిఁ గల్గుఁ బెంపు మహీశులార!, వినుతబలవిక్రమాధీశుఁ జెనసినట్లు.

118


క.

కావున నాప్రల్లదు లగు, భూవరుల జయించి వారిభూసామ్రాజ్య
శ్రీవిభవము గైకొనుఁడు మ, హీవల్లభులార! వెడలుఁ డెక్కుఁడు రథముల్.

119