పుట:మార్కండేయపురాణము (మారన).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వంతంబగు నద్దురాచారుం డవ్విధం బెఱుంగఁ డింతయు నెఱింగించితి నెట్లు వోలు
న ట్లనుష్ఠింపు మని యమ్మునివరుండు చనియె నంత నమ్మహీపతియుఁ బురంబున కరిగి.

260


ఆ.

ఆత్మమంత్రివరుల నందఱఁ బిలిపించి, తాను వినినతెఱఁగు దప్పకుండ
నాకుజంభువిధము నమ్ముసలప్రభా, వంబు తెలియఁజెప్పి వారి కపుడు.

261

కుజంభుని వధింప నేఁగినవిదూరథుసుతు లచట బద్దు లగుట

క.

ఆవసుధాపతితనయ ము, దావతి తండ్రికడ నుండి తద్విధ మెల్ల
న్దా వినియె నంత నొకనాఁ, డావెలఁదుక సఖులు దాను నారామమునన్.

262


వ.

విహరించుచుండం గుజంభుండు చనుదెంచి దానిం బట్టికొని చనుట విని కోపించి
యన్నరవరుండు కొడుకుల నాలోకించి మీరు సమస్తసైన్యసమన్వితుల రై యరిగి
నిర్వింధ్యాతటగర్తముఖంబునం బాతాళంబునకు డిగ్గి యన్నిశాటునిం గీటడఁ
గించి ముదావతిం దోడ్కొని రం డని పనుచుటయు.

263


చ.

సుమతియు నాసునీతియును శూరత సొం పెసలార సర్వసై
న్యములుకు దోడ రా నరిగి యవ్వివరంబున నారసాతలం
బు ముద మెలర్పఁ జొచ్చి వడిఁ బోరిరి పేర్చి కుజంబుతోడ ఖ
డ్గముసలశూలశక్తిపరిఘప్రదరప్రముఖాయుధంబులన్.

264


చ.

దనుజుఁడు రాజనందనులదర్పము సైఁపక రోషదీప్తుఁ డై
తనఘనమాయఁ జేర్చి వెసఁ దద్బలముం దెగటార్చి యార్చి పా
రి నణఁగఁ బట్టి విక్రమధురీణత బద్ధులఁ జేసెఁ జేసినన్
విని మదిలో విదూరథుఁడు వెన్బడి దానవు నోర్వఁ జాలమిన్.

265


క.

దనుజు దునిమి యెవ్వఁడు నా, తనయుల విడిపించు నట్టిధరణీశ్వరనం
దనునకు నిచ్చెద నాసుత, నని పురిలోఁ జాటఁ బనిచె నతఁ డార్తుం డై.

266


వ.

ఇట్లు చాటం బనిచి తనబిడ్డల చెఱలు దలఁగునట్టివీరుం డెవ్వఁడును లే కున్న నిరా
శుండై యుండె నంత భనందసుతుండు వత్సంధుం డంతయు విని యతనికడ కరు
గుదెంచి యే నద్దానపు నిర్జించి నీకొడుకులం గూఁతుం దెచ్చెద నన్నుఁ బనుపు
మనిన నవ్విదూరథుండు హర్షించి నిజమిత్రపుత్త్రుం డైనయాశౌర్యధుర్యునిం
గౌఁగిలించుకొని దీవించి వీడుకొలిపిన నతండు.

267


తే.

అతినిశాతఖడ్గంబు బాణాసనంబు, లలితగోధాంగుళిత్రాణములు ధరించి
యమ్మహాముఖబిలమున నతలమునకు, నమితసైన్యముతోఁ జని యార్చుటయును.

268

వత్సంధ్రుండు కుజంభుని వధించుట

క.

దారుణ మగుతన్నాదం, బారాక్షసవరుఁడు విని మహాక్రుద్ధుండై
బోరన వెడలె బలమ్ముల, తో రణకౌతుక మెలర్ప దోర్దర్పమునన్.

269


శా.

ఆవత్సంధుఁడునుం గుజంభుఁడును శౌర్యస్ఫూర్తియు న్సంగర
ప్రావీణ్యంబుఁ బరస్పరాంగదళన ప్రౌఢత్వము న్భూరిబా