పుట:మార్కండేయపురాణము (మారన).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధీయుత! నీవు నీదుమది దీనికిఁ బ్రేమము సేయు దేని భూ
నాయకపుత్రిఁ బెండ్లి యయిన న్జను దీని తగ న్వరింపఁగన్.

211


మ.

అని విప్రు ల్దగ నాడిన న్గనలి నేత్రాంతంబులం గెంపు గ
ప్ప నిశాతాసి కరంబున న్వెలుఁగ నాభాగుండు నవ్వైశ్యనం
దన కెంగేలు దెమల్చి యెవ్వఁ డయిన న్దప్పించిన న్మాన్పఁ జ
య్యన రా ని మ్మిదె యేను రాక్షసవివాహస్ఫూర్తిమై నేఁగెదన్.

212


వ.

అని పలికి యవ్వనితామణిం దోడ్కొని చనుటయు.

213


చ.

మదగజహస్తలగ్నలతమాడ్కిఁ గుమారునిచే గృహీత యై
నదళితపద్మపత్త్రనయనం దననందనఁ జూచి వైశ్యుఁ డా
ర్తి దనుకఁ జయ్యనం జని పతిం గని యంతయుఁ జెప్పెఁ జెప్పినం
త దనతురంగమాదిపృతనాతతిఁ బంపె నతం డుదగ్రుఁడై.

214


చ.

పనిచినయబ్బలంబులఁ గృపాణవిదారణమారణక్రియా
ఘనభుజలీలఁ గూల్చుటయు గ్రక్కున నెక్కుడువిక్రమం బెల
ర నిఖిలసైన్యయుక్తుఁ డయి రాజశిఖామణి దాను వీఁక మైఁ
జని నిజనందనుం బోదివి శస్త్రపరంపరఁ గప్పె నుగ్రుఁ డై.

215


ఉ.

కప్పిన నస్త్రశస్త్రముల ఖడ్గమునం దునుమాడి పీనుఁగుం
గుప్పలు గాఁగఁ గండ లొగిఁ గొండలు గా రుధిరంపుటేళ్లు గా
నిప్పులు కన్నులం దొరఁగ నిర్భరబాహుపరాక్రమంబు పెం
పొప్పఁగ నక్కుమారవరుఁ డుక్కున సేనలఁ ద్రుంచెఁ ద్రుంచినన్.

216

పరివ్రాజుఁ డనుముని ధృష్టనాభాగుల యంద్ధ ముడిగించుట

చ.

జనకుఁడు పుత్రబాహుబలసంపదకు న్వెఱఁ గంది యుండ స
న్ముని యొకరుండు భూవరునిముందటికి న్దివినుండి వచ్చి యి
ట్లనియె నరేంద్ర వీఁ డతిదురాత్ముఁడు కయ్యము నీవు మాను వై
శ్యునితనయ న్వరించినయశోధనుఁ డీతఁడు నీకు యోగ్యుఁడే?

217


వ.

బ్రాహ్మణక్షత్త్రియవైశ్యులు నిజవర్ణంబులకన్నియల మున్ను పరిగ్రహించి మఱి
తమతమదిగువకులంబులయంగనల వరియించుట శాస్త్రచోదితం బట్లు గాక
తొలుత హీనజాతి యగునాఁతిం బెండ్లి యయినయుత్తమవర్ణుం డాహీనజాతి
యగుం గావున నిప్పు డింతకు వైశ్యాపరిగ్రహంబునం జేసి వణిజుం డయ్యె శుద్ధ
క్షత్రియుండ వైన నీ కతనితోడియుద్ధం బనర్హం బని యమ్మునివరుం డరుగుటయు.

218

వైశ్యకన్యం బెండ్లాడుటచే నాభాగుఁడు వైశ్యుఁ డగుట

క.

తనయునితో సంగరమున, వినివర్తితుఁ డయ్యె నిట్లు విభుఁ డానృపనం
దనుఁడును గోమటికన్నియ, ననురక్తిం బెండ్లి యయ్యె నంత మునీంద్రా!

219