పుట:మార్కండేయపురాణము (మారన).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అమ్మహీపతి రాజ్యంబునం బ్రజ లాధివ్యాధులం బొందక క్షామడాంబరబాధలం
జెందక ధనధాన్యాదిసమస్తసంపదం బొంపిరివోవుచు నంతంతకు వర్ధిల్లుచుండి
రంత.

135


సీ.

అతఁడు విధూరథుం డనుమహీపతిసుత శుభలక్షణాన్విత సుందరాంగి
మానిని యను పేరిమానిని వరియించి యయ్యింతియందు బద్ధానురాగుఁ
డైకల నైనను నన్యకాంతలఁ గోర కాత్మధర్మములకు హాని గాని
క్రమమున వివిధసౌఖ్యము లొందుచుండఁగ సప్తసహస్రవర్షమ్ము లొక్క


ఆ.

దినము చనినభంగిఁ జనుటయు నొకనాఁడు, పౌరజానపదులు భూరమణులు
సచివవరులు నాప్తజనులును దగువారు, నర్థిఁ గొలువ నున్నయవసరమున.

136


ఆ.

మానినీవధూటి మగని కభ్యంగము, చేయువేళ నశ్రుశీకరంబు
లతనిమేన నించె నతఁ డిది యేమి యో, యనుచు మగిడి యాలతాంగిఁ జూచి.

137

మానినీరాజ్యవర్ధనసంవాదము

క.

పొలఁతి! యిది యేమి నావుడుఁ, బలుకక యతఁ డెన్నియేని భంగుల మఱియు
న్బలుమాఱు నడుగ నాతని, తల నొకనర యున్నఁ జూపి తరలాక్షి యనున్.

138


చ.

నరవర! నీదుమస్తకమున న్నర దోఁచిన దింతకంటె నా
కరయ విషాదహేతు వగునట్టిది యెయ్యది? యంచు బాష్పము
ల్గొరఁగఁగ గద్గదం బడర దుఃఖిత యైనలతాంగిఁ జూచి తా
దరహసితాననుం డయి ముదంబున నమ్మనుజేంద్రుఁ డి ట్లనున్.

139


క.

పౌరులు భూమిజనులు ధా, త్రీరమణులు బలసి యుండ ధృతి దొలఁగి వగం
గూరి కనునీరు నింపఁగ, నీరజదళనేత్ర! తగునె నీపెంపునకున్.

140


ఆ.

సకలజంతువులకు జన్మవర్ధనపరి, ణామగుణచయంబు నైజ మగుట
యెఱిఁగి యెఱిఁగి యింత యేటికి శోకింప?, విను లతాంగి! నాదువిధము దెలియ.

141


సీ.

చదివితి వేదముల్ శస్త్రాస్త్రవిద్యల నారూఢిఁ బొందితి నాహవమున
వైరుల నోర్చితి వసుధ నిర్వక్రంబు గాఁగఁ బాలించితిఁ గ్రతువు లెన్ని
యేని యొనర్చితి నీప్సితార్థంబులఁ బరితుష్టిఁ జేసితి బ్రాహ్మణులకు
మానిని! నీతో నమానుషభోగంబు లనుభవించితి నెయ్య మతిశయిల్ల


తే.

సకలపురుషార్థములు నాకు సంభవించె, నింక ముదిమికి శంకింప నేల చెపుమ?
వలులు పలితంబులును బెక్కు గలుగుఁ గాత, వాని కుచితంపువిధ మిప్పు డే నొనర్తు.

142


వ.

బాల్యకౌమారయౌవనవార్ధకావస్థలం దత్తదుచితప్రవృత్తిం బ్రవర్తించుట
యుత్తమక్షత్త్రియులకు విధివిహితకృత్యంబు మత్పూర్వులు నిట్ల వర్తించిరి
యిప్పుడు నామనంబు తపంబున కౌత్సుక్యం బొందుచున్న యది యిప్పలితాంకుర
దర్శనంబును నాకు నభ్యుదయకారణం బయ్యె నీ వింక నెవ్వగ దక్కు మని