పుట:మార్కండేయపురాణము (మారన).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యక్కాంతారత్నంబు నూఱడించుచున్న యన్నరపతివచనములు విని సచివులు
పౌరులు శోకాక్రాంతస్వాంతు లగుచు నమ్మహీకాంతున కిట్లనిరి.

143

రాజ్యవర్ధనభూపతికిఁ బౌరులకును సంవాదము

సీ.

ఆరయ దేవికిఁ గారణం బేమి యీవగపు మాయది గాక వసుమతీశ!
విపినంబునకుఁ దపోవృత్తి నీ వరిగినట్లైన సర్వక్రియాహాని గాదె!
యేడువేలేఁడులు నిల యేలి పడసిన సుకృత మిప్పుడు విడఁజూడఁదగునె?
ప్రజలఁ బాలించుధర్మము పదాఱవపాలుఁ బోలునే వని సేయఁబోవుతపము?


తే.

నింతయును నాత్మ నూహించి యీతపంబు, మాను మని యందఱును బలుమాఱు ప్రార్థ
నంబు సేయుడు నానరనాథవరుఁడు, గౌరవంబున వారలఁ గలయఁ జూచి

144


ఉ.

ఏలితి లీల నీవసుధ నింతయు సప్తసహస్రవర్షము
ల్పోలఁగ సత్కళత్రమునఁ బుత్త్రులఁ గాంచితి నెల్లవారలు
న్మేలన మంటి నింక నిటమీఁదటఁ బొందుతపోనివాసము
న్బోలునె కాలపాకమున యూరక యున్కి యేరికిన్?

145


క.

జనులార! మచ్ఛిరంబున, జనియించిన యీపలితము సమవర్తికిఁ గ
ట్టనుఁ గైనదూత గా మదిఁ, గనుఁగొనుఁ డట్లగుట నిజము గాదె తలంపన్.

146


ఉ.

కావున నైహికం బగుసుఖంబుఁ దొఱంగి తనూజు రాజ్యల
క్ష్మీవిభుఁ గాఁగఁ బ్రీతి నభిషిక్తుని జేసి ప్రబుద్ధబుద్ధి నై
యే విపినాంతరంబునకు నేఁగి కృతాంతునిదూత లెఫ్డు నా
పై వడి వత్తు రంతకుఁ దపం బొనరిం చెద నప్రమత్తతన్.

147


మ.

అని దైవజ్ఞులఁ జూచి పుత్త్రకుని రాజ్యశ్రీవిభుం జేయఁగా
దినలగ్నంబులు చెప్పుఁ డన్న విని ధాత్రీనాథునుద్యోగ మె
ల్లను దెల్లంబుగ వా రెఱింగి వగ లుల్లమ్ము ల్గలంపంగ నే
మనియుం జెప్పఁగ నేర కెప్పుడు సముద్యద్భాష్పదీనాస్యు లై.

148


వ.

అమ్మహీపతి నవలోకించి.

149


క.

జనవల్లభ! నీవాక్యము, విని మాహృదయములు శోకవికలము లగుట
న్దినలగ్నస్థితి దోఁపద, యని పలికిన నచట నున్న యఖిలజనంబుల్.

150


ఆ.

ఏకవాక్యముగ ననేకవిధములఁ, బ్రార్థనము చేసి రమ్మహీశుఁ
డచలితప్రయత్నుఁ డగుట గనుంగొని, యేమి సేయువార మింక ననుచు.

151

రాజ్యవర్ధనునియాయుర్వృద్ధికై పౌరులు సూర్యు నారాధించుట

వ.

అన్నరేంద్రచంద్రునిమీఁదియమందప్రీతి నందఱుం బెద్దయుం బ్రొద్దు విచారించి
యత్యంతనియతి భాస్వంతు నారాధించి యమ్మహీకాంతు నధికాయుష్మంతునిం
గావింతమని నిశ్చయించి యద్దిననాథు నుద్దేశించి.

152