పుట:మార్కండేయపురాణము (మారన).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భౌత్యమనుజననము

వ.

ఇట్లు హుతాశనవరప్రసాదంబునం జేసి.

66


క.

భూతికి భౌత్యుం డనఁగఁ బ్ర, భూతవిభూతిప్రభావభూరిభుజబల
స్ఫీతుఁ డుదయించె మనువై, యాతనికాలమునఁ గలసురాదుల వినుమా.

67

భౌత్యమన్వంతరమునందలి యింద్రాదుల వివరణము

వ.

చాక్షుషులు కనిష్ఠులు పవిత్రులు భ్రాజితులు ధారావృకులు నన దేవత లేనుగణం
బులును శుచి యనువాఁ డింద్రుండును నాగ్నీధ్రాగ్నిబాహుశుచిముక్తమాధవ
శుక్రాజితులనువారు సప్తమునులును గురుగభీరబ్రధ్నభరతానుగ్రహప్రీతిమత్ప్ర
వీరవిష్ణుసంక్రందనతేజస్విసుబలాభిధాను లగుమనుపుత్రులు ధాత్రీశులై వర్తింపఁ
గలవారు స్వాయంభువస్వారోచిషోత్తమతామసరైవతచాక్షుషవైవస్వతసూర్య
సావర్ణిబ్రహ్మసావర్ణిధర్మసావర్ణిరుద్రసావర్ణిదక్షసావర్ణిరౌచ్యభౌత్యు లనునీమను
వులజన్మప్రకారంబు వినిననరునకుఁ గ్రమంబున ధర్మకామార్థజ్ఞానవృద్ధ్యారోగ్య
బలగుణవత్పుత్త్రపౌత్త్రమాహాత్మ్యశుభవిజయజ్ఞాతిప్రాధాన్యరిపువినాశదేవతా
ప్రసాదాద్యైశ్వర్యంబులు గలుగు మన్వంతరదేవతలను దేవేంద్రుని సప్త
మునులను రాజులను సావధానులై యాకర్ణించుమహాత్ములు సర్వపాపవిముక్తులు
సర్వశుభయుక్తులు సర్వకాల కుశలసమన్వితులు నగుదు రింద్రులుపదునలువురు
గలయంతకాలంబును బుణ్యలోకసుఖంబు లనుభవింతు రనిన మార్కండేయ
మహామునికిం గ్రోష్టుకి యిట్లనియె.

68

మహారాజవంశవర్ణనము

తే.

వింటి మన్వంతరస్థితివిలసనములు, క్రమముతో నీవు చెప్పఁగ నమితపుణ్య!
వినఁగఁ వేడ్క యయ్యెడు నాకు విస్తరింపు, నలువనుండి వచ్చిన రాజకులము నెల్ల.

69


క.

అనిన మృకండతనూజుండను విను చెప్పెదఁ జతుర్ముఖాద్య మయి జగ
మ్మునకు మొద లైననృపతుల, జననముఁ జరితంబు నీకు సౌజన్యనిధీ!

70


సీ.

ఎం దేనియు మనువు నిక్ష్వాకుఁడు ను ననరణ్యుండు నొగి భగీరథుఁడు నాది
గా ననేకులు ధరిత్రీనాథు లధికవిభూతిసమేతులు భూరిబలులు
ఛార్మికు లధ్వరతత్పరు ల్శూరులు పరమవిజ్ఞానులు భవ్యయశులు
జనియించి రేవంశమునయందు బహుసహస్రవిభేదవంశము ల్సంభవించె


తే.

మఱ్ఱి నూడలు దిగ్గినమాడ్కి నర్థి, మనుజు లేవంశమున పెంపు విని సమస్త
దురితనిరుక్తు లగుదురు ధరణి నట్టి, విమలవంశంబు చెప్పెద విను మునీంద్ర!

71

సూర్యుని జననప్రకారము

వ.

ప్రజాపతి ప్రజల సృజియింపఁ దలంచి దక్షిణాంగుష్ఠంబున దక్షుని వామాంగుష్ఠం
బునఁ దదీయభార్యను నుత్పాదించిన నాదక్షుని కదితి యనుకన్యక యుదయించె