పుట:మార్కండేయపురాణము (మారన).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దానియందుఁ గశ్యపుఁ డొకయండంబు పుట్టించె నయ్యండంబు బ్రహ్మస్వరూపం
బును సకలజగత్పరాయణంబును నుత్పత్తిస్థితివిలయకారణంబు నయి వెలుంగుచు.


తే.

సర్వభూతమయాత్ముండు శాశ్వతుండు, సఖలభువనైకమూర్తియు నవ్యయుండు
నైనభాస్వంతుఁ డాదిత్యుఁ డయ్యెఁ దొల్లి, యదితిచేత నారాధితుం డగుటఁ జేసి.

73


సీ.

అనినఁ గ్రోష్టుకి యిట్టు లనియె వివస్వంతు నాకార మెట్టి దయ్యాదిదేవుఁ
డనఘ! కశ్యపునకు నాత్మజుం డై యెట్టి కారణంబునఁ బుట్టెఁ గశ్యపుండు
నదితీయు నెమ్మెయి నతని నారాధించి రతఁడు వారల కేమి యానతిచ్చె
నవతరించినయమ్మహాత్ముమాహాత్మ్యంబువిధ మెట్టి దెఱిఁగింపు వినఁగ వేడ్క


తే.

యగుచు నున్నది మునినాథ! యనుడు నమ్మృ, కండతనయుండు వినుము మార్తాండుఁ డాది
నుద్భవించినవిధము నీ కున్నరూపు, తెలియఁజెప్పెద సంతతాతులితపుణ్య!

74


వ.

ఇంతయు నిష్ప్రభంబు నిరాలోకంబును నై యుండ నొక్కమహాండం బావిర్భ
వించె నందుఁ బ్రపితామహుండుం బద్మయోనియు బ్రహ్మయు స్రష్టయునై తాన
కలిగె నతనిముఖంబున మహానాదంబుతో నోంకారం బుద్భవించె దానివలన
భూరాదివ్యాహృతులు మూఁ డుద్భవించె నని సూర్యునిసూక్ష్మరూపంబులు
మహోజనస్తపస్సత్యంబు లనునాలుగుస్థూలరూపంబులు నిత్యుం డగుదివాకరు
నియం దియ్యేడురూపంబులు నుత్పత్తివిలయంబులయందుఁ గలుగుచు నడంగుచు
నుండు ము న్నేను జెప్పినయోంకారం బద్దేవుం డగుబ్రహ్మ తను వని వెండియు.

75


సీ.

నలువతొల్మోమున నవజపాచ్ఛవిరజోన్వితము నై వెడలె ఋగ్వేద మనఘ!
దక్షిణాస్యమున రక్తద్యుతిసత్త్వసముద్రిక్త మై యజు వుద్భవించె
చరమముఖంబున సామంబు తెలు పయి పుట్టఁ దమోగుణస్ఫూర్తి మెఱయ
నుత్తరాననమున నుద్భవించె నధర్వ మసిత మై సత్త్వతమోతిశయిత


తే.

నమరు నీనాల్గుశ్రుతులకు నాద్యమైన, యట్టిప్రణవంబు తేజోమహత్త్వమునను
ఋగ్యజుస్సామతేజంబు లేకభావ, మొంది త్రిగుణమయస్థితి నుల్లసిల్లు.

76


తే.

కెలఁకులందును మీఁదను గ్రింద దీప్తు, లెసఁగ మండలీభూతమై యివ్విధమున
వేదములమూఁటితేజంబు నాదిపరమ, తేజమునఁ జేసి యనఘ! యాదిత్యుఁ డయ్యె.

77


వ.

ఇట్లు విశ్వంబునకుఁ గారణంబై యవ్యయుం డైనభాస్వంతుండు ఋగ్యజుస్సామం
బులగుణంబులం జేసి క్రమంబునం బూర్వాహ్ణమధ్యాహ్ణాపరాహ్ణంబులయందు శాం
తికపౌష్టికాభిచారికంబు లంగీకరించి సర్వంబును దపింపఁజేసి సృష్టియందు బ్రహ్మయు
స్థితియందు విష్ణుండును సంహారంబున రుద్రుండు నై వెలుంగుచుఁ ద్రివేదమయుం
డును ద్రిగుణాత్మకుండును ద్రిపురుషమూర్తియు నని జగంబులు గీర్తింప నొప్పువివ