పుట:మార్కండేయపురాణము (మారన).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్యంతహితము నీ కెయ్యది, సంతసమున దాని నడుగు సౌజన్యనిధీ!

55

అగ్నిదేవుఁడు సంతుష్టుఁ డై శాంతికి వరమిచ్చుట

చ.

అనవుడు నాతఁడేను భవదాకృతిఁ గన్గొనఁ గంటి మంటి నా
మనమున వంత యంతయును మానెఁ గృతార్థుఁడ నైతిఁ జెప్పెద
న్వినుము మహాత్మ! మద్గురుఁడు నెమ్మి ననుం దనయాశ్రమంబునం
దునిచి సహోదరాధ్వరమహోత్సవదర్శనలాలసాత్ముఁ డై.

56


ఆ.

చనిన మదపరాధమున భవద్విరహిత, మయ్యె ధిష్ణ్య మిప్పు డందు నీవు
హవ్యవాహ! తొంటియట్ల వెలుంగఁగ, వలయు గురుఁడు సూచి యెలమిఁ బొంద.

57


సీ.

వెండియు నీవు నా కొండువరంబు ప్రసాదించె దేని యస్మద్గురునకు
సత్పుత్త్రు నొకనిఁ బ్రసాదింపు తనయుని యం దెట్టు లట్టు నాయందు నిఖల
సత్వంబులందు నాసంయమిహృదయంబు మార్దవం బొనరింపు మైత్రి వెలయ
నీస్తోత్రమున నిన్ను నెవ్వఁడు కీర్తించు నతనికి వరదుండ వగుము దేవ!


తే.

యనిన ననలుండు నీవు న న్నడిగినట్టి, వరము లన్నియు నిచ్చితిఁ గరుణ నీకు
ననఘ! యీస్తవంబున నను వినుతిసేయు, నతని కీప్సితవివిధపుణ్యములు గలుగు.

58


ఆ.

పూర్ణిమాదిపర్వములయందు బహువిధ, సవనతీర్థహోమసమయములను
భక్తి నీస్తవంబు పఠియించునరులకు, నఘము లాఁగు శుభము లావహిల్లు.

59


క.

అని చెప్పి యతఁడు చూడఁగ, ననలుఁడు హతదీపభంగి నంతర్ధానం
బునఁ బొందె శాంతి యంతం, దనమనమున సంతసంబు దనరంగన్.

60


ఆ.

గురుగృహంబుఁ జూచి కుండంబులోఁ దొంటి, యట్ల వెలుఁగుచున్న యనలుఁ జూచి
పూర్ణచంద్రుమాడ్కిఁ బొల్పారె నతఁడు హ, ర్షామృతంబు వొంగి యవల వెడల.

61


వ.

అయ్యవసరంబున.

62

భూతి శాంతికృత్యమునకు సంతోషించుట

క.

అనుజునియాగము చెల్లినఁ, దనయాశ్రమమునకు వచ్చెఁ దద్దయును ముదం
బున భూతి మ్రొక్కి యతనికి, నొనరించెను శాంతి సవినయోచితపూజల్.

63


ఉ.

డెందమునం బ్రమోదము ఘటిల్లఁగ నమ్ముని శిష్యుఁ జూచి నీ
యందును సర్వభూతములయందును నిప్పుడు సౌహృదంబు
యందుఁ గుమార! నిశ్చలితమైనది యీవిధ మేమి యొక్కొ య
స్పందితపుణ్య! యే నెఱుఁగఁ జయ్యనఁ జెప్పుము నాకు నావుడున్.

64


చ.

అనలవినాశ మాదిగ యథార్థము సర్వము శాంతి సెప్పిన
న్విని ప్రమదాశ్రు లాస్యమున వెల్లిగొనం బులకాంకురంబులన్
దను వమరంగ నమ్ముని ముదంబునఁ గౌఁగిటఁ జక్కఁ జేర్చి శి
ష్యుని నొగి సాంగవేదవిభవోజ్జ్వలుఁ గా నొనరించెఁ బ్రీతిచేన్.

65