పుట:మార్కండేయపురాణము (మారన).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

దారపరిగ్రహ మొల్లక, యారయ సత్సుతులఁ బడయ కర్చనముల బృం
దారకపితృతతిఁ దనుపక, కోరుదు నీ వెట్లు సుగతి గుణరత్ననిధీ!

12


వ.

అనినఁ బితరులకు రుచి యి ట్లనియె.

13


క.

అతిదుఃఖము నఘము నధో, గతియుఁ బరిగ్రహమువలనఁ గరము కలిమి మ
న్మతిఁ గని మును దారస్వీ, కృతి యే నొనరింప నైతిఁ గృతమతులారా!

14


ఆ.

అఖిలకరణనిగ్రహమునఁ జేయఁగఁబడు, నాత్మసంయమము మహాత్ములార!
యతులముక్తిహేతు వాసంయమము పరి, గ్రహమువలన ముక్తి గానరాదు.

15


ఆ.

వినుఁ డనేకజన్మజనిత మై బహుకర్మ, పుంజకర్ధమమున బ్రుంగు నట్టి
యాత్మ నిర్జితేంద్రియాదులచేఁ గడు, గంగఁబడు మహాత్మసంగవారి.

16


వ.

అనినం బితృదేవతలు నియతేంద్రియు లగువారలకు నాత్మప్రక్షాళనంబు యుక్తం
బగు నైనను నీవు ప్రవర్తించునిమ్మార్గంబు గర్మలోపంబు నాపాదించు ఋణంబు
లేనుంద్రోచినం గాని యశుభంబు ద్రోపువడదు సక్తుండు గాక విహితకర్మంబు
లాచరించిన బంధంబు రాదు ప్రాజ్ఞులు పూర్వకర్మకృతం బైనసుఖదుఃఖజాతంబు
భోగంబున నాళంబు నొందించి యాత్మప్రక్షాళనంబు నేమఱ రనినఁ బితరులం
జూచి కరమార్గం బవిద్య యని వేదంబుల వినంబడు మీ రె ట్లందు నన్ను
నియోగించెద రనిన వార లది నిజంబు కర్మం బవిద్య యనం దగు నైనను విద్యా
ప్రాప్తికిం గర్మంబు కారణంబు గావున నీవు విధ్యుక్తప్రకారంబున దారపరి
గ్రహంబు సేయుము జన్మంబు విఫలంబు గావింపకుము లౌకికం బనుష్టింపు మనిన
నతం డిట్లనియె.

17


ఆ.

ఏను జాల వృద్ధు నెవ్వఁడు నా కిప్డు, గన్య నిచ్చు? నెట్లు గలుగుఁ బెండ్లి?
కరము పేద యైననరునకు నెందు భా, ర్యాపరిగ్రహంబు భరము గాదె?

18


క.

అనినఁ బితృదేవతలు మాకును నీకును నరకగతి యగుం జుమ్మీ నీ
మనమున మావచనంబులు, గొనియాడక విడిచితేనిఁ గులజలధిశశీ!

19


క.

అని చెప్పి యతఁడు చూడఁగ, మునిసత్తమ! వా రదృశ్యమూర్తు లయిరి పె
ల్చనఁ గరువలిచే నాఱిన, ఘనదీపంబులును బోలె గ్రక్కున నంతన్.

20


ఉ.

ఆరుచి పైతృకోక్తి హృదయంబున కార్తియొనర్ప నెల్లెడ
న్ధారుణిఁ గన్యక న్వెదకి తా నొకచోటను గాన లేక లో
నారట మగ్గలింప వెగడందుచు నిం కెటఁ బోదు నేను? నా
కోరిక దైవ మెట్లు సమకూరఁగఁ జేసెడు? నేమి సేయుదున్?

21


ఉ.

అక్కట మత్పితృప్రభృతి కభ్యుదయంబుగ దారసంగ్రహం
బెక్కడ గల్గు నాకుఁ దగ నిప్పుడ? యంచు విషాదవేదనం
బొక్కుచు నారుచి ప్రభుఁడు బుద్ధిఁ దలంచెఁ దపంబు సేసి యే
నక్కమలాసనుం గొలుతు నాదటతో నని నిశ్చితాత్ముఁ డై.

22